JEE Main 2024 : జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ విద్యార్థుల హవా
X
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఎన్టీఏ(NTA) విడుదల చేసిన పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100శాతం స్కోరు సాధించారు. వీరిలో ఏడుగురు తెలంగాణకు చెందిన వారు కాగా, ముగ్గురు ఏపీ విద్యార్థులున్నారు. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరపు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి 100 పర్సంటైల్ స్కోరు సాధించారు.
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ఫలితాలను అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in వెబ్ సైట్ లో విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు ఇందులోకి లాగిన్ అయి స్కోర్ కార్డు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఎన్టీఏ మరో వైబ్ సైట్ ntaresults.nic.in లోకి లాగిన్ అయ్యి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల విడుదల తర్వాత రీవ్యాల్యూయేషన్ కానీ, ఫలితాల రీ చెకింగ్ కు కానీ అనుమతించడం లేదని ఎన్టీఏ తెలిపింది. నిన్న జేఈఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీని విడుదల చేసిన ఎన్టీఏ... ఫలితాలు కూడా విడుదల చేస్తుందని భావించినా ఆలస్యం కావడంతో ఇవాళ వెలువడ్డాయి.
జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరైన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను మంగళవారం వెల్లడించారు. చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.