Telangana Government : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్తగా 1,890 స్టాఫ్ నర్సుల పోస్టులు
X
రాష్ట్రంలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు అదనంగా 1,890 కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబరు 30న.. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,204 స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భర్తీ సమయానికి ఖాళీలు పెరిగితే ఆ పోస్టులకు నియామకాలు జరుపుతామని అందులో పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష కూడా నిర్వహించింది. ఆ తర్వాత మరో 1,890 ఖాళీ పోస్టులను గుర్తించింది. వాటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. అయితే రాత పరీక్ష ముగిసి, ఫలితాలు ప్రకటించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఫలితాల ప్రకటనను మెడికల్ బోర్డు వాయిదా వేసింది.
ఎన్నికల ఫలితాలతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత... రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 2 న జరిగిన రాతపరీక్షకు సంబంధించి వారంలోపే ఫలితాలను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదించిన 1,890 పోస్టులను కూడా పాత నోటిఫికేషన్‌లో కలపాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు ఈ పోస్టులను కూడా కలిపింది. ఆ వివరాలను జోన్ వారీగా విడుదల చేసింది.
తాజా నిర్ణయం మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ పరిధిలో, వైద్యవిద్యాసంచాలక పరిధిలో 5,650 పోస్టులు, వైద్యవిధాన పరిషత్ పరిధిలో 757 పోస్టులు, ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో 81, దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో 8, మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థలో 127, బీసీ గురుకుల సంస్థ పరిధిలో 260, గిరిజన గురుకుల సంస్థ పరిధిలో 74, ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో 124, తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో 13 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది.
ఇందులో జోన్ 1 పరిధిలో 937, రెండో జోన్‌లో 1,044, మూడో జోన్‌లో 1,023, నాలుగో జోన్‌లో 719, అయిదో జోన్‌లో 1,305, ఆరో జోన్‌లో 948 పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో 2,110 ఓసీ, ఈడబ్ల్యూఎస్ 653, బీసీ-ఎ 612, బీసీ-బి 686, బీసీ-సి 81, బీసీ-డి 466, బీసీ-ఇ 330, ఎస్సీ 1,041, ఎస్టీ 690, క్రీడా కోటాలో 114, దివ్యాంగుల కోటాలో 311 పోస్టులుంటాయని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని పేర్కొంది.