Telangana Govt:తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంపు
X
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయో పరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచింది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ నిర్ణయం తెలంగాణలో చాలామంది నిరుద్యోగులకు మేలు చెయ్యనుంది. చాలా మంది నిరుద్యోగులు గ్రూప్-1 సహా చాలా పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే.. ప్రశ్నా పత్రాల లీకేజీల వల్ల, పరీక్షల నిర్వహణ వాయిదా పడుతోంది. దాంతో వారి వయసు పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో.. వయసు పెరిగినా, అభ్యర్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు వీలు కలగనుంది.
టీపీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, గత ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పోటీ పరీక్షలకు తమ ఏజ్ లిమిట్ అయిపోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వయోపరిమితి పెంచాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంచుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది. ఐతే.. హామీల అమలు కొంత ఆలస్యమయ్యేలా ఉంది. అందువల్ల ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు, కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు. అయితే వారికి వయో పరిమితి పెరిగిపోయే ప్రమాదం ఉండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏజ్ లిమిట్‌ని 44 ఏళ్ల నుంచి, 46 ఏళ్లకు పెంచింది. అందువల్ల నిరుద్యోగులు కొంత ఉపశమనం పొందుతారు. ఇక వారు తమ లక్ష్యాలు సాధించేందుకు వీలు కలగనుంది.