గురుకుల కొలువుల పరీక్ష తేదీ ఖరారు..
X
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాత పరీక్షల తేదీలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు (CBRD) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి.ఈ పరీక్షలకు ఇతర నియామక పరీక్షల తేదీలతో ఇబ్బందులు లేకుండా గురుకుల బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు నియామక మండలి, వైద్య నియామక మండలి అధికారులను సంప్రదించిన తరువాత ఆగస్టు తేదీలను ఖరారు చేసింది. అక్టోబరు నాటికి ఫలితాలు వెల్లడించి, ఈ విద్యాసంవత్సరంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
మొత్తం 9,210 పోస్టులకు గాను గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా.. 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి.