కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ.. హైకోర్టు కీలక తీర్పు..
X
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులను కలపాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. దీనిని పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ ఉత్తర్వులను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓయూ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది. అభ్యంతరాలు ఉన్న నాలుగు ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని హైకోర్టు సూచించింది.
హైకోర్టు తీర్పుతో 15,640 కానిస్టేబుళ్ల పోస్టులకు అడ్డంకి తొలగింది. కాగా నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. అయితే నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది.