గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
X
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ యథాతధంగా జరగనుంది. ఈ నెల 11న జరగనున్న ఈ ఎగ్జామ్ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేదాకా ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఇటీవల పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎగ్జామ్ను వాయిదా వేయడానికి నిరాకరించింది.
ఎగ్జామ్ వాయిదాకు నిరాకరిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇప్పటికే తీర్పునివ్వగా... పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు దానిని సవాల్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. దాంతో ఆ సంస్థ విశ్వసనీయతపై సందేహాలున్నాయని ధర్మాసనానికి పిటిషనర్లు వివరించారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను యూపీఎస్సీకి అప్పగించాలని కోరారు.
ఈ కేసులో ఇంకా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులందరూ ఇంకా బయటపడలేదని పిటిషన్లో వివరించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం.. ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది. దీంతో ఎల్లుండి జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది.