Home > కెరీర్ > ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఒక ఇంటర్నల్‌ రద్దు

ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఒక ఇంటర్నల్‌ రద్దు

ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఒక ఇంటర్నల్‌ రద్దు
X

ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ఒక ఇంటర్నల్‌ పరీక్షను క్యాన్సిల్ చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను తొలగిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

మరో ఇంటర్నల్‌ అయిన ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామ్ ను యథాతథంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 100 మార్కుల ఈ ఇంటర్నల్‌ ఎగ్జామ్‌ను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్‌ పేపర్‌ కాగా, ఈ మార్కులను రెగ్యులర్‌ మార్కుల్లో కలపరు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌ అమలు చేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్‌ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో స్పెషల్ గా ఎగ్జామ్ అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

ఇక ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వాటితో పాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కూడా అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. ఆ తర్వాత థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు.




Updated : 25 Oct 2023 9:07 AM IST
Tags:    
Next Story
Share it
Top