EAMCET : ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్
X
తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 2 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 4, 5వ తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 4 నుంచి 7 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 11న స్టూడెంట్స్ కు సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ మూడో వారంలోగా విద్యార్థులు ఫీజు చెల్లించి వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 114 బీఫార్మసీ కాలేజీలు ఉండగా వాటిలో 6,910 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. 61 కళాశాలల్లో ఫార్మ్-డి కోర్సులో 1,192, బయో టెక్నాలజీలో 94, బయో మెడికల్ ఇంజినీరింగ్‌లో 36, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 81 కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు.
మరోవైపు తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడగించారు. రూ.1000 ఫైన్ చెల్లించి ఈ నెల 16 వరకు కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. వాస్తవానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ జులై 31తో ముగిసింది. అయితే రూ.500 ఫైన్తో ఆగస్టు 16 వరకు ప్రవేశాలు తీసుకునేందుకు అనుమతించారు. తాజాగా గడువుతేదీని సెప్టెంబర్ 16 వరకు పొడగించారు.
శుక్రవారం నాటికి 4,92,873 మంది ఇంటర్ స్టూడెంట్స్ వివిధ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలోని 1285 ప్రైవేటు కాలేజీల్లో 3,11,160 మంది విద్యార్థులు చేరగా.. 408 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 83,177 మంది జాయిన్ అయ్యారు. ఎస్సీ గురుకులాల్లో 16,102 మంది, బీసీ గురుకులాల్లో 14,077 మంది, మైనారిటీ గురుకులాల్లో 10,506, గిరిజన గురుకులాల్లో 8,416, జనరల్ గురుకులాల్లో 2,560 మంది విద్యార్థులు చేరారు.