TS SET 2023 | టీఎస్ సెట్ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
X
ఉస్మానియా యూనివర్సిటీ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్.. రేపటి( సెప్టెంబర్ 4 వ తేదీ)తో టీఎస్ సెట్-2023 దరఖాస్తునకు గడువు ముగియనుంది. ఈ ఏడాదికి గానూ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి ఆగష్టు 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు సెప్టెంబర్ 4 వ తేదీతో ముగియనుంది. అంతకుముందు ఆగష్టు 29 వ తేదీ వరకు గడువు ఉండగా రేపటి(సోమవారం) వరకు పొడిగించారు.
కాగా, రూ.1500 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 10వ తేదీ వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 18 వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుంకు అదనం. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 20 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూల్, కరీంనగర్, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల కోసం www.telanganaset.org అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
పీజీ ఉత్తీర్ణులైన వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు టీఎస్ సెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ -1ను 50 ప్రశ్నలకు నిర్వహించనుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. పేపర్ -2లో 100 ప్రశ్నలుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఓసీలు 40 శాతం, రిజర్వేషన్ క్యాటగిరీలో 35 శాతం మార్కులు పొందితే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు.