TSPSC: రేపు ఏఈ మెకానికల్ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష
X
తెలంగాణలో ఏఈ మెకానికల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల నియామక రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం (అక్టోబరు 26) రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే 18, 19, 20న సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), టెక్నికల్ ఆఫీసర్ (టీవో), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీవో) ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరిగాయి. ఇక మెకానికల్ విభాగానికి అక్టోబరు 26న పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరు 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 18 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.