ఇండస్ట్రీలో కొత్త ఫ్రాడ్.. బ్రహ్మాజీ బయటపెట్టిన నిజాలు
X
మోసం.. ఇది వినిపించని రంగం లేదిప్పుడు. సినిమా ఇండస్ట్రీలో ఇవి కాస్త క్రియేటివిటీతో జరుగుతాయి. ఎంతోమంది ఇలాంటి క్రియేటివ్ చీట్స్ లో పడిపోతుంటారు. అయితే నటుడు బ్రహ్మాజీ బయటపెట్టిన కొత్త తరహా మోసం మాత్రం ఈజీగా ఎవరైనా నమ్మేలా ఉందంటే అతిశయోక్తి కాదు. మామూలుగా మీకు ఫలానా సినిమాలో ఆఫర్ వచ్చిందని ఫోన్లు చేయడం.. దానికి మాకేంటీ అనే మాట దగ్గర నుంచి ఎంతో కొంత లాగేసుకోవడం వంటివి చూస్తుంటాం. చాలామంది ఇవి బయటకు చెప్పుకోరు. కానీ బ్రహ్మాజీ లాంటి సీనియర్ యాక్టర్ ముందు కూడా అలాంటి కుప్పిగంతులు వేస్తే కుదురుతుందా.. అందుకే తనకు జరిగిన మోసాన్ని ట్విట్టర్ లో పెట్టి, సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్ తో పాటు యూపిఐ ఐడిని కూడా యాడ్ చేశాడు.
తాజాగా బ్రహ్మాజీకి 7826863455 అనే మొబైల్ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. ఇది దర్శకుడు లోకేష్ కనకరాజ్ మేనేజర్ అనే పేరుతో ట్రూ కాలర్ లో చూపిస్తోందట. అతను లోకేష్ నెక్ట్స్ మూవీలో మిమ్మల్ని (బ్రహ్మాజీని) తీసుకుంటున్నాం అని.. ఖచ్చితమైన కొలతలతో ఉన్న కొన్ని బట్టలు రెంట్ కు తీసుకోవాల్సిందని.. ఆ డబ్బులు మీరు చెల్లించాలని చెప్పారట. అలాగే ఆడిషన్ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం అంటూ చెప్పాడట. మరి ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న బ్రహ్మాజీకి ఇది మోసం అని గ్రహించడం పెద్ద కష్టమా.. ?
అయితే బ్రహ్మాజీ అందర్లా లైట్ తీసుకోకుండా.. ఈ మోసగాడి ఫోన్ నెంబర్ తో పాటు యూపిఐ ఐడీ UPI ID jashlucky7777@oksbi ఇది అంటూ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇతనితో పాటు 9087787999 అనే నంబర్ వ్యక్తి కూడా ఈ తరహా మోసాలతో డబ్బులు గుంజుతున్నారని హెచ్చరించాడు. మరో నటుడు సత్యదేవ్ కూడా ఈ తరహా కాల్ వల్ల మోసపోయాడని చెప్పడం గమనార్హం.