సంపూర్ణ నటుడు చంద్ర మోహన్
X
చంద్ర మోహన్.. నేటి తరానికి తాత, తండ్రి పాత్రగా తెలుసు. నిన్నటి తరానికి కామెడీ హీరోగా తెలుసు. ఆ ముందు తరానికి ఎన్నో మరపురాని పాత్రలతో అద్భుతమైన నటన కనబరిచిన ఒక సాఫ్ట్ హీరోగా తెలుసు. ఒక నటుడి కెరీర్ లో ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని వైరుధ్యాలు ఉండటం అత్యంత అరుదు. అలాంటి అరుదైన నటుడే చంద్ర మోహన్. తను ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రే కనిపిస్తుంది. హీరోగా ఎన్నో ఉదాత్తమైన పాత్రల్లో కనిపించాడు. అంతే సడెన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ లోనే కాదు. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లోనూ స్పష్టమైన నటన పలికించడం చంద్ర మోహన్ కు మాత్రమే తెలిసిన విద్య. అందుకే ఆయన్ని సంపూర్ణ నటుడు అన్నారు.
మొదటి సినిమాకే బిఎన్ రెడ్డి దర్శకుడు
చంద్ర మోహన్ కు కే విశ్వనాథ్ దూరపు చుట్టం. కానీ ఆ చుట్టరికంతో పరిశ్రమకు రాలేదు. తనుగా వచ్చాడు. మొదటి సినిమానే తెలుగు సినిమా దిగ్దర్శకుడుగా చెప్పుకునే బిఎన్ రెడ్డిది. ఆ సినిమా రంగుల రాట్నం. బిఎన్ రెడ్డి వంటి దర్శకుడు ఓకే చేశాడంటే అతనెంత ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో వాణిశ్రీ ఆయనకు భార్యగా నటించడం విశేషం. ఆ తర్వాత మహానటుడు ఎస్వీ రంగారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన బాంధవ్యాలులో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీలో చంద్రమోహన్ నటన చూసిన ఎస్వీఆర్.. మరో రెండు అంగులాలు ఎత్తు ఉండి ఉంటే.. ఇండస్ట్రీని ఏలేవాడివే అని ప్రశంసలు కురిపించారు. ఇక బాపు తీసిన బంగారు పిచ్చిక తో హీరోగా మారాడు. అలాగని హీరోగానే ఫిక్స్ కాలేదు. వచ్చిన ప్రతి పాత్రా చేసుకుంటూ వెళ్లాడు. హీరోగా నటిస్తూనే ఇతర పాత్రల్లో కనిపించాడు. కెరీర్ ఆరంభంలోనే కే విశ్వనాథ్ సిరిసిరి మువ్వ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో సాంబయ్య పాత్రలో మరెవర్నీ ఊహించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అటుపై విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సీతామాలక్ష్మిలో నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశ్వనాథ్ డైరెక్షన్ లోనే వచ్చిన శుభోదయంలోనూ బాగా నటించాడు. రాఘవేంద్రరావు పదహారేళ్ల వయసులో గోపాలకృష్ణగా గొప్ప నటన చూపించాడు. ఈ పాత్ర తమిళ్ లో కమల్ హాసన్ చేశాడు. ఆ ఛాయలేవీ కనిపించకుండా తనదైన ముద్రను బలంగా వేశాడు చంద్రమోహన్.
పౌరాణికాల్లోనూ మెరిసిన చంద్ర మోహన్
పౌరాణికాలు తక్కువే చేసినా యశోద కృష్ణలో నారదుడుగా, కురుక్షేత్రంలో అభిమన్యుడుగా, దైవ తిరుమనగళ్ అనే తమిళ్ చిత్రంలో శివుడుగా చక్కగా ఒదిగిపోయాడు. ఇక కరుణామయుడు గుడ్డివాడి పాత్రలో చంద్రమోహన ఆ రోజుల్లో ఎంతోమంది ఇమిటేట్ చేసేంత నటనను చూపించాడు. ఇక కృష్ణ, రజినీకాంత్ లతో కలిసి మల్టీస్టారర్ గా చేసిన రామ్ రాబర్ట్ రహీమ్ లో రహీమ్ గా చంద్రమోహన్ అంత పెద్ద స్టార్స్ మధ్య కూడా తన ఉనికిని బలంగా నిలబెట్టుకున్నాడు.
హీరోయిన్లకు సెంటిమెంట్ హీరో
చంద్ర మోహన్ సరసన హీరోయిన్లుగా పరిచయమైన వారంతా టాప్ స్టార్స్ అయ్యారు. అప్పట్లో ఆయన ఒక సెంటిమెంట్ కూడా. ఆయన సరసన హీరోయిన్ గా పరిచయం కావాలని ఎంతోమంది వేచి చూసేశారు. ఈ లిస్ట్ లో శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వాళ్లు చాలామందే ఉన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ తరహా రికార్డ్ ఉన్న ఏకైక నటుడు చంద్రమోహన్.
కామెడీ హీరోగా
ఒక దశ దాటిన తర్వాత ఆయన కామెడీ హీరోగా మారాడు. ముఖ్యంగా రేలంగి నర్సింహారావు డైరెక్షన్ లో చాలా సినిమాల్లో నటించాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ తోనూ ఎన్నో సినిమాల్లో హీరోగా ఆకట్టుకున్నాడు. నిన్నే పెళ్లాడతాకు ముందు వరకూ హీరోగా లేదంటే హీరో ఫ్రెండ్ గా కనిపించినా.. ఈ మూవీ తర్వాత పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. నిన్నే పెళ్లాడతా ఇంటర్వెల్ టైమ్ లో ఆయన నటన గురించి నేటికీ చెప్పుకుంటారు. ఇక కొత్త సహస్రాబ్దిలో సరికొత్త ఫాదర్ అయ్యాడు చంద్ర మోహన్. ఈ తరంలో వచ్చిన ఎందరో హీరోలకు ఆయనే ఫాదర్ యాక్టర్. ఈ క్రమంలో నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మనసంతా నువ్వే, 7/జి బృందావన కాలనీ, నువ్వే నువ్వే, ఒక్కడు, వర్షం, కృష్ణ, బలాదూర్, బాద్ షా, డార్లింగ్ వంటి ఎన్నో సినిమాల్లో అత్యద్భుతమైన నటన చూపించాడు. అందుకే ఈ తరం కుర్రాళ్లకు ఆయన పేరు చెప్పగానే ఈ పాత్రలే ఎక్కువగా గుర్తొస్తాయి.
ఎస్వీ రంగారావు మెచ్చిన నటుడు
చంద్ర మోహన్ లాంటి నటులు ఏ పరిశ్రమలో అయినా అరుదుగా ఉంటారు. మరో చోట అయితే చెప్పలేం కానీ.. తెలుగులో మాత్రం ఆయనకు ప్రతిభకు తగ్గ గుర్తింపు, గౌరవం పూర్తి స్థాయిలో దక్కలేదు అనే చెప్పాలి. అయినా ఏనాడూ ఇలాంటివి పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇండస్ట్రీలోనూ ఏ విభేదాలూ లేవు. అజాతశతృవుగానే ఉన్నారు. కాస్త పిసినారి అన్న పేరున్నా.. తన ముందు తరం నటులను చూసి నేర్చుకున్న జాగ్రత్త అది అని చెప్పుకున్నారు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి నటులతో చివరి వరకూ మంచి స్నేహ బంధాన్ని కొనసాగించారు. ఎలా చూసినా చంద్ర మోహన్ గొప్ప నటుడు. ఏ పరిశ్రమలోనూ ఏ నటుడికీ సాధ్యం కాని వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు.
సాధారణంగానే పరిశ్రమలోకి ఎంటరై తనదైన ప్రతిభతో అసాధారణమైన ప్రయాణాన్ని సాగించాడు. అంతులేని విజయాలు అందుకున్నాడు. హీరోగా కే విశ్వనాథ్ కథకు ఎంత చక్కగా ఒదిగిపోయాడో.. కామెడీ హీరోగా రేలంగి నర్సింహారావు కథకూ అంతే చక్కగా సరిపోయాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తోన్న టైమ్ లో అనారోగ్యానికి గురయ్యారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని స్వచ్చందంగా సినిమాలకు దూరమయ్యారు. కొన్నాళ్లుగా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత విశేషాలను పంచుకుంటూ వస్తున్నారు. తన తరం నటులు చనిపోయినప్పుడల్లా వెళ్లారు. అందరి జ్ఞాపకాలను తలచుకుంటూ తన వంతు కోసం చూస్తున్నా అంటూ గద్గద స్వరంతో చెప్పేవారు. ఇప్పుడు ఆయన వంతూ వచ్చింది.. వెళ్లిపోయారు.
ఏదేమైనా ఒక తరం నటుల్లో అగ్రగణ్యుడుగానే వెలిగాడు చంద్ర మోహన్. ఆ చంద్ర తారార్కమైన కీర్తిని సంపాదించారు. మరణం ఎవరికైనా అనివార్యమే. కొందరి మరణాలు ఎందరినో బాధిస్తాయి. అంతమందికి బాధ కలిగించేంత జీవితం గడిపారు అంటే వారి జన్మ ధన్యం అయినట్టే. అలాంటి అభిమానాన్ని, అభిమానుల్ని సంపాదించుకున్న చంద్ర మోహన్ లాంటి నటులకు మరణం భౌతికమే.. నటుడుగా ఆయన చిరంజీవి.
- కామళ్ల. బాబురావు