పాతికేళ్ల అనుబంధం.. బీజేపీకి సీనియర్ హీరోయిన్ రాజీనామా
X
తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్నిఆమె లేఖ ద్వారా తెలియజేశారు. చాలా బరువెక్కిన హృదయంతో బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
"బీజేపీతో నాకు ఉన్న 25 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. నా రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు స్టేట్ ఛీప్ అన్నామలైకి పంపించాను" అని గౌతమి ట్విట్టర్‌లో తెలిపారు. " గత 25 సంవత్సరాల క్రితం దేశ నిర్మాణానికి దాని ప్రయత్నాలను అందించడానికి బీజేపీ పార్టీలో చేరాను. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, నేను ఆ నిబద్ధతను గౌరవించాను.. అయితే ఈ రోజు నేను నా జీవితంలో ఊహించలేని సంక్షోభం నెలకొంది.. పార్టీ నుంచి, నేతల నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించారన్నారు. అయినప్పటికీ.. పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నాను. కానీ, 25 ఏళ్లపాటు సేవ చేసిన నన్ను కాదని.. నన్ను నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తికి కొందరు సీనియర్ నేతలు మద్దతిస్తున్నారు. ఈ కారణాల వల్లే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను" అని గౌతమి లేఖలో ఆరోపించారు.
స్థిరాస్తుల విషయంలో అళగప్పన్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ పోలీసులకు గౌతమి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘డబ్బు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్‌ల విషయంలో మోసం చేసిన వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి 40 రోజులు గడిచినా.. అతడు తప్పించుకు తిరిగేలా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు సాయం చేస్తున్నారు. 25 ఏళ్లపాటు నిబద్ధత సేవ చేసిన నాకు కాకుండా.. అతనికే సపోర్ట్ ఇస్తున్నారు’ అని గౌతమి పేర్కొన్నారు. నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.