నాకు ప్రాణహాని ఉంది..తుపాకీ లైసెన్స్ ఇవ్వండి..నరేష్
X
సీనియర్ నటుడు నరేష్ ,పవిత్రా లోకేష్..ఈ మధ్య కాలంలో వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. లేటు వయసులో వీరి ఘాటు ప్రేమ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది చాలదన్నట్లు మళ్లీ పెళ్లి సినిమాతో తెరమీద కనిపించారు నరేష్ పవిత్రలు. ఇక ఈ సినిమా సమయంలో ఈ జంట కిస్సింగ్‌లు , హగ్గింగులతో ఇంటర్నెట్ ఎలా షేక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా వెండితెరపై పెద్దగా హిట్ కొట్టకపోయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్న నరేష్‌కు ఏమైందో ఏమిటో సడెన్‌గా గురువారం పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డి కార్యాలయంలో కనిపించాడు. స్వీయ సంరక్షణ కోసం తన తుపాకీకి లైసెన్స్ ఇవ్వాలని ఎస్పీని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తనకు ప్రాణ హాని ఉందని చెప్పకనే చెప్పాడు నరేష్. దీంతో మరోసారి నరేష్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
ఎం.ఎస్.రాజు డైరెక్షన్లో నరేష్ హీరోగా, పవిత్ర లోకేష్ హీరోయిన్గా నటించిన మళ్లీ పెళ్లి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్నిఅందించలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 24 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ఓటీటీలో విడుదలైన వెంటనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేస్తూ పరువు తీసేందుకే సినిమా మేకర్స్ ఈ మూవీని తీశారని ఆరోపణలు చేశారు. క్రియేటివిటీ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు నరేష్ తన స్వీయ సంరక్షణ కోసం తన తుపాకీకి లైసెన్స్ అడగడంతో అందరూ అవాక్కవుతున్నారు. నరేష్‌కు ఎవరి నుంచైనా బెదిరింపులు వస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.