Navdeep Drugs Case: ఏడేళ్ల నాటి కాల్ లిస్ట్ ఆధారంగా నవదీప్ విచారణ
X
మదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ విచారణ ముగిసింది. నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆయనను 6 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాల్ని బయపెట్టాడు.
డ్రగ్స్ కేసులో నోటీసులు ఇవ్వడంతో నార్కోటిక్స్ ఆఫీసుకు వచ్చానని నవదీప్ చెప్పారు. రాం చందర్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన అది పదేళ్ల కిందటి సంగతని అన్నారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని, గతంలో ఓ పబ్ నిర్వహించినందుకే తనను పిలిచి ప్రశ్నించారని చెప్పారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ప్రశ్నిస్తోందని చెప్పారు. అయితే ఏడేళ్ల క్రితం నాటి కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. అవసరముంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని అన్నారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోందని నవదీప్ ప్రశంసించారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు.