అవార్డు వచ్చినా చెత్తబుట్టలో పడేస్తా.. విశాల్ షాకింగ్ కామెంట్స్
X
తన నటనకు గొప్ప అవార్డులు వచ్చినా.. వాటిని చెత్తబుట్టలో పడేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ స్టార్ హీరో విశాల్. అవార్డులపై తనకు ఎలాంటి నమ్మకం లేదని చెప్పారు. విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ'. ఈ చిత్రంలో రీతూ వర్మ జంటగా నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ చెన్నైలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు విశాల్. ఈ సందర్భంగా ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అవార్డులపై తనకు ఎలాంటి నమ్మకం లేదని, ఒకవేళ తనకు అవార్డులు వస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తానని విమర్శించారు.
అవార్డులపై నాకు అస్సలు నమ్మకం లేదు. ప్రజలందరూ కలసి ఇచ్చేదే నిజమైన అవార్డు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లపాటు పరిశ్రమలో నిలదొక్కుకుంటూ చిత్రాల్లో నటిస్తున్నా. నిజానికి అదే నాకు పెద్ద అవార్డు. ఒకవేళ నేను నటించిన చిత్రాలకు అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తానని తెలిపారు. రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ గురించి అడిగిన ప్రశ్నకు..‘జీవితంలో ఏదైనా జరగొచ్చు. ఒకప్పుడు నటీనటుల (నడిగర్) సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధారవి నన్ను సంఘం సభ్యుడిగా చేరమని పలుమార్లు అడిగారు. ఆ తర్వాతే చేరాను. కొంత కాలానికి అదే సంఘంలో ఆయనకు పోటీగా ఎన్నికల్లో దిగి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందా. అదే విధంగా భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. మన చేతుల్లో లేద’ని తెలిపారు.