డ్రగ్స్ కేసుపై నటి సురేఖ వాణి రియాక్షన్
X
మరోసారి డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టు కావడం..అతని కాంటాక్ట్ లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖులు ఉండడం పెద్ద దుమారమే రేగుతోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేపీ చౌదరి అరెస్ట్ అయినప్పటి నుంచి అతడితో సంబంధమున్న వారి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. వారిలో సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీతలు ఉన్నారు. వారిద్దరు కేపీ చౌదరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో సురేఖ వాణి, సుప్రీతలు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
డ్రగ్స్ కేసుపై నటి సురేఖ వాణి స్పందించారు. తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తమకు ఎటువంటి సంబంధం లేదని వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని సురేఖవాణి కోరారు. ఈ ఆరోపణల వల్ల తమ కుటుంబం, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు సినీ నటి జ్యోతి కూడా తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని చెబుతూ ఒక వీడియోను విడుదల చేసింది. కేపీ చౌదరి తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది.