ప్రజలకు ఆదిపురుష్ రచయిత క్షమాపణలు
X
ఆదిపురుష్.. ఆది నుంచి వివాదాల మధ్యే నలిగిన మూవీ. టీజర్తో మొదలైన నెగిటివిటీ విడుదల తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. రామయణ కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. రామాయణాన్ని వక్రీకరించి సినిమా తీశారని ఆరోపణలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. హిందూ సంఘాలు పలుచోట్ల షోలను కూడా అడ్డుకున్నారు. రామాయణంలోని కొంత భాగాన్ని మాత్రమే సినిమాగా తీశామని డైరెక్టర్ చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఆదిపురుష్ రచయిత క్షమాపణలు చెప్పడం గమనార్హం. దేశ ప్రజలకు రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా క్షమాపణలు చెప్పారు. ఆదిపురుష్‌తో బాధపెట్టినందుకు క్షమించాలంటూ ఇన్‌స్టా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆదిపురుష్ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నా. మా వల్ల ఇబ్బందిపడిన వారందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. ఆ హనుమంతుడు మన్నందరినీ ఐక్యంగా ఉంచాలని .. మన దేశానికి సేవ చేసేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని మనోజ్ పోస్ట్ చేశారు.
ఆదిపురుష్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన తరుణంలో మనోజ్ ఇలాంటి పోస్ట్ పెట్టడం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఆదిపురుష్ టీంకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల షాకిచ్చింది. జులై 27న దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కూమార్, డైలాగ్ రైటర్ మనోజ్ మంతాషిర్‌ను కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.