Akshay Kumar citizenship : ఎట్టకేలకు.. బాలీవుడ్ హీరోకు భారత పౌరసత్వం
X
77 స్వాతంత్ర్య దినోత్సవం వేళ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇవాళే భారతీయుడినైనట్లు ప్రకటించాడు. కొన్నేళ్లుగా భారతీయ పౌరసత్వం విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ కు కేంద్ర తీపి కబురు చెప్పింది. ఎట్టకేలకు ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ భారతదేశమే.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు అక్షయ్ కి కెనెడా దేశ పౌరసత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లుగా భారత పౌరసత్వం లేని ఆయనకు చివరికి అది లభించింది.
అక్షయ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో అతని సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి స్థిరపడటానికి.. తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అప్పటినుంచి అక్షయ్ కెనడా పాస్ పోర్ట్ తో భారత్ లో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఆ పాస్ పోర్ట్ ను రిన్యూవల్ కూడా చేయించుకున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్షయ్ భారతీయులంతా ఓటు హక్కు కలిగి ఉండాలని, తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. ఈ విషయాలపై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. భారత్ లో ఉంటూ పౌరసత్వాన్ని కలిగి ఉండకపోవడంపై తప్పుబట్టారు. దీనిపై స్పందించిన అక్షయ్ ఓ ఇంటర్వ్యూలో ‘1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. నా కెరీర్ ముగిసింది అనుకునేలోపు నా కెనడా స్నేహితుడి సలా మేరకు అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా. అంతలోనే నా సినిమాలు హిట్ అయి.. అవకాశాలు తలుపుతట్టాయి. దాంతో నా కెనడా ప్లాన్ వాయిదా వేసుకున్నా’అని చెప్పుకొచ్చాడు.