ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయాలని మోడీకి లేఖ
X
ఆది నుంచి ఆదిపురుష్ మూవీ వివాదాల్లోనే కొనసాగుతోంది. టీజర్ నుంచి మొదలు సినిమా రిలీజ్ దాకా మూవీ మొత్తం వివాదాల్లోనే మునిగింది. ఆదిపురుష్తో ఓం రౌత్ రామాయాణాన్ని కించపరిచారనే ఆరోపణలు అన్నీవైపుల నుంచి వస్తున్నాయి. వాల్మికీ రామాయణం తీసానంటూ చెప్పి.. తనదైన పైత్యంతో రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి సినిమా తీశాడని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల షోలను కూడా అడ్డుకున్నాయి.
ఈ కాంట్రవర్సీల నేపథ్యంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మోడీకి లేఖ రాసింది. ఆదిపురుష్ మూవీని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేసింది. ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాకుండా చూడాలని కోరింది. డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మూవీతో శ్రీరాముడు, హనుమంతుడి ప్రతిష్టను దిగజార్చడంతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు.
‘‘శ్రీరాముడు ప్రతి భారతీయుడికి దేవుడు. వీడియో గేమ్స్లోని పాత్రల్లా ఈ మూవీలో రాముడిని, రావణుడిని చూపించి వారందరినీ మూవీ యూనిట్ బాధపెట్టింది. వెంటనే ఈ మూవీని నిషేధించాలని ప్రధానిని కోరుతున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డైరెక్టర్, డైలాగ్ రైటర్, ప్రొడ్యూసర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. శ్రీరాముడి ప్రతిష్టను కాపాడాలి. మరోసారి ఇటువంటి సినిమాల్లో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగం కావొద్దు’’ అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానికి లేఖ రాసింది.