‘ఆదిపురుష్’పై విచారణ.. అలహాబాద్ హైకోర్టు సీరియస్
X
మైథలాజికల్ మూవీ అంటూ, రామాయణ ఇతిహాసం ఆధారంగా తీశానని చెప్పుకుంటున్న ఓం రౌత్ డైరెక్ట్ చేసి జనాల మీదికి వదిలిన ఆదిపురుష్ పై పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమా విడుదలైనప్పటి నుంచే ఓ వర్గం.. పురాణాలను వక్రీకరించారని, ఇష్టానుసారంగా తమకు తోచినట్లు తీశారని.. ముఖ్యంగా సినిమాలో చూపించిన పాత్రలు ఒరిజినల్ రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు కోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి కూడా. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలాంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.
విచారణలో ఆదిపురుష్ మేకర్స్‌పై సీరియస్ అయింది. సినిమాను సర్టిఫైడ్ చేసిన సెన్సార్ బోర్డును కూడా తప్పుబట్టింది. సినిమాలోని డైలాగులను ఎలా ఓకే చేశారంటూ గట్టిగా ప్రశ్నించింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తు తరాలకు ఏం నేర్పాలనుకున్నారంటూ మండిపడింది. అలాగే విచారణకు డైరెక్టర్ ఓం రౌత్, ప్రొడ్యూసర్స్ ఎందుకు రాలేదంటూ అసహనం వ్యక్తం చేసింది.. ‘‘రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంక.. ఇలా అందరినీ చూపించి డిస్‌క్లెయిమర్‌లో రామాయణంతో సంబంధం లేదని ప్రదర్శిస్తే జనం ఎలా నమ్ముతారు?’’ అని మండిపడింది.
‘‘హిందువులు చాలా క్షమాగుణం ఉన్నవారు. అలాగని ప్రతిసారీ వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు? సభ్యత చూపుతూ సహనంతో ఉన్నారు కదా అని అణచివేతకు దిగడం సరైనదేనా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. సినిమా చూసి కూడా ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండటం గొప్ప విషయమని తెలిపింది. సినిమాలో అభ్యంతరకరమైన డైలాగులను రాసిన సహ-రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్లాను భాగస్వామిగా చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మనోజ్ ముంతాషీర్‌కు నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.