చిరంజీవికి ఏపీ సర్కార్ షాక్..? టికెట్ రేట్ల పెంపుపై...
X
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ విడుదలకు సిద్ధమైంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అగస్ట్ 11న రిలీజ్ కానుంది. తమిళ చిత్రం వేదాళం రీమేక్గా వస్తున్న భోళా శంకర్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు ఓ రేంజ్లో ఉండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా ఏపీలో టికెట్ల పెంపుకు అనుమతివ్వాలని నిర్మాతలు దరఖాస్తు చేయగా.. ఏపీ ప్రభుత్వం తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి.
భోళా శంకర్ మేకర్స్ టికెట్ పై 25 రూపాయలు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రెమ్యునరేషన్ కాకుండా సినిమాకు 101 కోట్లు ఖర్చు అయ్యాయని.. కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్ రేట్ల పెంపుకు అనుమతివ్వాలని ఆ దరఖాస్తులో కోరింది. అయితే దరఖాస్తులో సరైన డాక్యుమెంట్స్ లేవని అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎల్లుండే సినిమా రిలీజ్ ఉండడంతో టికెట్ల రేట్ల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవిపై వైసీపీ శ్రేణులు రివర్స్ అటాక్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఏంచేయాలో చిరంజీవి చెప్తే తాము వినే పరిస్థితుల్లో లేమని మంత్రి రోజా అన్నారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూడని సూచించారు. ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఇవ్వాలని హితవు పలికారు. ఇటు చిరంజీవి అభిమానులు వైసీపీపై ఫైర్ అవుతున్నారు.