Ranbir Kapoor: ఎన్టీఆర్ రూట్ లో రణ్ బీర్ కపూర్
X
రణ్ బీర్ కపూర్ కు బాలీవుడ్ లో సెపరేట్ ఇమేజ్ ఉంది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటాడు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న రణ్ బీర్ ఇప్పుడు యానిమల్ తో రాబోతున్నాడు. డిసెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన యానిమల్ టీజర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత రణ్ బీర్ ఓ పౌరాణిక చిత్రం చేయబోతున్నాడు. అది కూడా రామాయణ కావ్యం. యస్.. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రంలో రణ్ బీర్ రాముడుగా కనిపించబోతున్నాడు. సాయి పల్లవిని సీత పాత్ర కోసం తీసుకుంటున్నారు. తనింకా సైన్ చేయలేదు కానీ..చేయడం పక్కా అంటున్నారు. రావణుడు పాత్ర కోసం కేజీఎఫ్ స్టార్ యశ్ ను తీసుకున్నారు. యశ్ ఈ మూవీ షూటింగ్ లో వచ్చే యేడాది సెకండ్ హాఫ్ నుంచి జాయిన్ అవుతాడట.
ఇక ఈ మూవీ కోసం రణ్ బీర్ కపూర్ ఆనాటి ఎన్టీఆర్ లా ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడని బి టౌన్ టాక్. ఈసినిమా షూటింగ్ జరిగి విడుదలయ్యేంత వరకూ మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడట. మన నటరత్న నందమూరి తారక రామారావు కూడా పౌరాణిక చిత్రాలు చేస్తున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు కఠినంగా అమలు చేసేవాడు. పైగా నేలమీదే నిద్రించేవారని కూడా చెబుతుంటారు. రణ్ బీర్ కూడా అన్నగారిని ఫాలో కావాలనుకుంటున్నాడంటే ఈ పాత్రను సీరియస్ గా తీసుకున్నాడు అనే కదా అర్థం.
కాకపోతే బాలీవుడ్ వాళ్లే కాదు.. ఇండియాలోనే తెలుగు వాళ్లు తప్ప పౌరాణికాలను అంత గొప్పగా ఎవ్వరూ తీయలేదు.. తీయలేరు అనే నానుడి ఉంది. రీసెంట్ గానే బాలీవుడ్ నుంచే వచ్చిన ఆదిపురుష్ అనే కళాఖండాన్ని తరించి ఉన్నాం కదా.. ? ఓ రకంగా రామాయణ గాథను ఈ సినిమాతో అపహాస్యం చేశారు వాళ్లు. ఇప్పుడు నితీష్ తివారీ వంతు వచ్చింది. అయితే ఆదిపురుష్ విషయంలో జరిగిన రగడ వాళ్లకూ తెలుసు కాబట్టి ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకునే చేయాలి. అందుకే రణ్ బీర్ కూడా కొన్ని కఠిన మైన నిర్ణయాలకు సిద్ధం అవుతున్నాడు.కాకపోతే అతను అంత క్రమశిక్షణను మెయిన్టేన్ చేయగలడా అనే డౌట్ ఎవరికైనా వస్తే అస్సలు తప్పులేదేమో. ఏదేమైనా రామాయణం తీస్తే తెలుగువాళ్లే తీయాలి..చూస్తే తెలుగువాళ్లు తీసిందే చూడాలి అంటారు.