Bhagavanth Kesari Movie Review: భగవంత్ కేసరి మూవీ రివ్యూ
X
తారాగణం : బాలకృష్ణ, శ్రీ లీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, రవిశంకర్, శరత్ కుమార్, జాన్ విజయ్,
ఎడిటింగ్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ : సి రామ్ ప్రసాద్
సంగీతం : థమన్ ఎస్
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అనగానే ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. దీనికి తోడు ఇద్దరూ తమ సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ టైమ్ డిఫరెంట్ కంటెంట్ తో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నట్టు అర్థమైన తర్వాత భగవంత్ కేసరి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ గురువారం విడుదలైన భగవంత్ కేసరి అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం..
కథ :
నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) ఒక ఖైదీ. తను ఉన్న జైలులో ఒక వ్యక్తిపై హత్యా ప్రయత్నం జరిగితే భగవంత్ అడ్డుకుని ఆ రౌడీలను కొడతాడు. అది నచ్చిన జైలర్(శరత్ కుమార్) భగవంత్ గురించి తెలుసుకుని తనతో పాటే ఉంచుకుంటాడు. జైలర్ తో పాటు అతని కూతురు విజ్జి పాప(శ్రీ లీల) కూడా భగవంత్ కేసరికి బాగా దగ్గరవుతుంది. భగవంత్ తల్లి చావు బతుకుల్లో ఉండగా.. రూల్స్ కు విరుద్ధంగా అతన్ని జైలు నుంచి బయటకు తీసుకుపోయాడని జైలర్ ను సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ కావడానికి ముందే అతను జెండా వందనం రోజు విడుదల చేసే ఖైదీల లిస్ట్ లో భగవంత్ పేరు రాస్తాడు. అలా బయటకు వచ్చిన భగవంత్ జైలర్ దగ్గరకే వెళతాడు. అదే రోజు అతను ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అప్పటి నుంచి విజ్జిపాపకు గార్డియన్ గా మారతాడు. విజ్జి పాపను ఎలాగైనా ఆర్మీలో చేర్చాలనుకుంటున్నప్పుడు ఆమెను చంపడానికి రాహుల్ సాంఘ్వీ ప్రయత్నిస్తాడు. మరి అతనెవరు..? విజ్జిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు.. ? రాహుల్ కు, భగవంత్ కు ఉన్న కనెక్షన్ ఏంటీ..? అసలు భగవంత్ జైలుకు ఎందుకు వెళ్లాడు.. ? అనేది మిగతా కథ.
ఎలా ఉంది..
ఒక టాప్ స్టార్ ను, మాస్ హీరోను అతని సేఫ్ జోన్ నుంచి బయటకు రప్పించి కథ చెప్పి ఒప్పించడం పెద్ద టాస్క్. ఆ టాస్క్ లో సక్సెస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి.. సినిమాను మాత్రం ఆ రేంజ్ లో మెప్పించడా అంటే చెప్పడం కష్టం. ఇది నేను రాశాను కాబట్టి ఇలాగే ఉండాలి అనే లాంటి సన్నివేశాలే తప్ప.. సరైన, బలమైన, పూర్తి కన్విన్సింగ్ గా కనిపించే సీన్స్ చాలా తక్కువ.
ఫస్ట్ హాఫ్ లో జైలు నుంచి మొదలుపెట్టిన అనిల్.. శ్రీ లీల, బాలయ్యకు మధ్య బాండ్ ఉండాలి కాబట్టి అన్నట్టుగానే సీన్స్ రాసుకున్నాడు. జైలర్ పాత్రను అంత డమ్మీగా వదిలేయడం అస్సలు బాలేదు. అతను చనిపోయిన విధానం కూడా వీరిద్దరికీ దారివ్వడానికే అన్నట్టుగా ఉంది తప్ప సహజంగా కుదరలేదు. ఇక శ్రీ లీల, బాలయ్య మధ్య కథ మొదలైన తర్వాత కాస్త వేగం పెరుగుతుంది. కానీ సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు. ఆమెను ఎంతో జాగ్రత్తగా పెంచినా.. ఆర్మీ అంటే తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ట్రెయిన్ చేస్తుండటం.. ఇందుకోసం కాత్యాయని(కాజల్) సాయం కోరడం.. ఆమె అతనిపై మనసు పడటం.. ఇలా అక్కడక్కడా లాగ్ అవుతున్నా.. ఒక ఫ్లోలో వెళుతున్నా.. ఏదో ఒక వెలితి అనుకుంటోన్న టైమ్ లో చాలా రొటీన్ గా పెద్ద విలన్ ఎంట్రీ.. దానికి ముందు చిచ్చా, విజ్జీకి మధ్య గ్యాప్. మళ్లీ ఆ గ్యాప్ ను ఫిల్ చేస్తూ విలన్ విజ్జి లైఫ్ లోకి రావడం.. ఆమెను కాపాడే క్రమంలో తను అసలు వెదుకుతున్న విలన్ వాడే అని తెలుసుకుని వార్నింగ్ ఇవ్వడం.. ఇవన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్టు కనిపించినా.. ఫస్ట్ టైమ్ బాలయ్య తరహా లౌడ్ వాయిస్ లో కాకుండా సెటిల్డ్ గా ఉండటం వల్ల భరించగలిగేలానే ఉంటాయి.
ఇక సెకండ్ హాఫ్ లో తన ఫ్లాష్ బ్యాక్. జైలుకు ఎందుకు వెళ్లాడు అనే క్రమంలో భగవంత్ కేసరి ఆదిలాబాద్ అటవీ ప్రాంతానికి చెందిన పోలీస్ గా పరిచయం చేయడం.. ఆ పోలీస్ గట్స్ కోసం అబ్బో అరిగిపోయిన రికార్డ్ లాంటి సీన్స్ నే మళ్లీ రాసుకుని బాలయ్యతో బలవంతంగా చేయించినట్టు కనిపించడం.. ఈ క్రమంలో అక్కడక్కడా గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ పోలీస్ ల తరహా మూర్ఖత్వం ఆ పాత్రలో కనిపించడం.. తను కొట్టిన ఓ లోకల్ పొలిటీషియన్ కొడుకే నేటి పెద్ద విలన్ అవడం.. ఈ సెటప్ అంతా చాలా అవుట్ డేటెడ్.
చుట్టూ వందలాది గన్స్ తో బాడీగార్డ్స్ ఉన్నా.. భగవంత్ కేసరి ఈక కూడా టచ్ చేయలేకపోవడం బాలయ్య ఇమేజ్ ను వాడుకోవడమా లేక.. మన దర్శకులు ఇంకా అప్డేట్ కాలేకపోతున్నారనుకోవడమా అనేది తెలియదు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత శ్రీ లీల ట్రెయినింగ్ సెంటర్ సీన్స్, బాలయ్య ఓ చిన్న పాప కోసం ఆ స్కూల్ కు వెళ్లి చెప్పిన విషయాలు హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి. ఆ స్కూల్ విషయాలపై చాలా సినిమాలే వచ్చినా.. ఎందుకో బాలయ్య చెబుతుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది.
మళ్లీ క్లైమాక్స్ వెరీ రొటీన్. ఊళ్లో ఇద్దరు రౌడీలు. ఇద్దరు కొట్టుకుని ఎవడు మిగిలితే వాడిదే రాజ్యం అనే కాన్సెప్ట్ ఎన్ని దశాబ్దాల క్రితందో మీరే ఊహించుకోవాలి. ఇక ఈ క్లైమాక్స్ తో వందలాది విలన్స్ వస్తుంటే మెయిన్ విలన్ టెర్రస్ లాంటి ప్లేస్ లో కూర్చుని కామ్ గా చూడ్డం.. శ్రీలీల ఆర్మీకి వెళ్లడానికి పూర్తిగా సన్నద్ధం అయిందని చెప్పేందుకు ఆమెతో చేయించిన రోప్ షాట్ విన్యాసాలూ.. అందరు రౌడీలూ పోయాక.. చివర్లో షర్ట్ విప్పి కిందకి దూకి ఫైట్ చేయడం.. అబ్బో.. అనిల్ రావిపూడి రాసుకున్న ఈ కథ, కథనాలు ఎంత అవుట్ డేటెడ్ గా ఉన్నాయో చెప్పలేం.
విజ్జి పాపను ఆర్మీలో చేర్చడం ఎవరి కోరిక అనేది ఆమెకు తెలియకుండానే ఎండ్ కార్డేశాడు అనిల్.
నటన పరంగా బాలయ్య హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల అతన్ని తిడితే కాజల్ తో మాట్లాడే సన్నివేశంలోని నటన బాలయ్యకు మాత్రమే సాధ్యం అవుతుంది. సెకండ్ హాఫ్ లో తన తల్లే అతన్ని డ్రగ్స్ కేస్ లో సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకున్నప్పుడు అతని ఎక్స్ ప్రెషన్ బాలయ్యే చెయ్యగలడు. ఇక శ్రీ లీలకు ఇది కెరీర్ బెస్ట్ రోల్ అవుతుంది. రెండు మూడు వేరియేషన్స్ ను అద్భుతంగా పలికించింది. హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉండి.. ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకుందా అనుకున్నవారికి సమాధానం సినిమాలో కనిపిస్తుంది. కాకపోతే ఈ కథే మరీ పాత చింతకాయ. కాజల్ రోల్ రొటీన్. విలన్ గురించి, అతని పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సెంట్రల్ మినిస్టర్స్, సిఎమ్ లు కూడా ఆకు రౌడీల్లా తిరుగుతారు అనుకున్న అనిల్ రాతలోని గొప్పదనం ఇది. ఇతర పాత్రలన్నీ వెరీ రొటీన్.
టెక్నికల్ గా విషయం వీక్ గా ఉన్నా.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కాస్త నిలబెట్టే ప్రయత్నం చేశాడు తమన్. సక్సెస్ అయ్యాడు కూడా. పాటల్లో ఉయ్యాలో జంపాల మాత్రమే ఓకే. మిగతావి బాలేదు. ఎడిటింగ్ పరంగా చూస్తే చాలా ల్యాగ్ ఉంది. డైలాగ్స్ జస్ట్ ఓకే. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఈజీగా అర్థం అవుతున్నాయి. డైలాగ్స్ ఫర్వాలేదు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. సెట్స్, ఆర్ట్ వర్క్ చాలా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి.
దర్శకుడుగా అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ కథ కాదు ఇది. అతని బలం ఎంటర్టైన్మెంట్. అది పూర్తిగా లోపించింది. పోనీ కొత్త బలంగా యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించాడా అంటే ఆ విషయంలో పూర్తిగా అవుట్ డేటెడ్ కథ, కథనాలతో ఆకట్టుకోవాలని చూశాడు. బాలయ్య లాంటి హీరో గెటప్ మార్చడానికి ఒప్పుకున్నప్పుడు.. ఇంకేదైనా మ్యాజిక్ ఎక్స్ పెక్ట్ చేసి ఉన్నవారిని పూర్తిగా నిరాశపరిచాడు అనలేం కానీ.. పూర్తిగా శాటిస్ ఫై కూడా చేయలేదు.
ప్లస్ పాయింట్ :
బాలకృష్ణ
శ్రీ లీల
ఫైట్స్
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
వీక్ నెరేషన్
దర్శకత్వం
వినోదం
ఫైనల్ గా : భగవంత్ కేసరి.. ఎక్కువ కాలం యాదుండే కథేం కాదు బ్రో..
రేటింగ్ : 2.5/5 - కామళ్ల. బాబురావు.