Amitabh Bachchan tweet president of Bharat : ఇండియా పేరు మార్పుపై బిగ్ బీ ఆసక్తికర ట్వీట్
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క హాట్ టాపిక్ ఇది. మోదీ ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన చర్చ జరుగుతోంది. G20 సదస్సులో పాల్గొనే నాయకులను సెప్టెంబర్ 9 న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆహ్వాన పత్రికతో ఈ చర్చ మొదలైంది. ఆ ఇన్విటేషన్లో President of Indiaకు బదులుగా president of Bharat అని రాసి ఉంది. భారత్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ లో డిన్నర్ ఉంటుందని తెలిపింది. జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ ఇండియా అని కాకుండా ‘భారత్’ అని రాశారు. అందులో ‘భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని రాసి ఉండటంతో తీవ్ర వివాదానికి దారితీసింది.
ప్రస్తుతం దేశ ప్రజలు ఇండియా పేరు మార్పు గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విటర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘భారత్ మాతాకీ జై’అని ట్విటర్లో ఆయన పోస్ట్ చేశాడు. ఈ నోట్‌కి తోడుగా నేషనల్ ఫ్లాగ్‌ను జత చేశారు. దీంతో అమితాబ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది బిగ్ బీకి సపోర్టివ్‌గా ట్వీట్ చేస్తే..మరికొందరు వ్యతిరేకంగా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ‘జయా జీ అంటే మీకు భయం లేదా?’ అంటూ కొంతమంది ఫన్నీ రిప్లైలు పంపుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కీ 2898’ సినిమాలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దిపికా పదుకొణె నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోంది. దీంతో ఫ్యాన్స్ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.