Home > సినిమా > Bigg boss season 7 : గ్రాండ్ లాంఛ్ 2.0కు ముహూర్తం ఫిక్స్..!

Bigg boss season 7 : గ్రాండ్ లాంఛ్ 2.0కు ముహూర్తం ఫిక్స్..!

Bigg boss season 7 : గ్రాండ్ లాంఛ్ 2.0కు ముహూర్తం ఫిక్స్..!
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. క్యాప్షన్ కు తగ్గట్లే ఉల్టాపల్టాగా సాగుతోంది. ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఏడుగురు మేల్ కాగా.. ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే బిగ్ బాస్ చరిత్రలోనే అతితక్కువ మంది పోటీదారులతో షో నడుపుతున్న సీజన్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా మరికొందరు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపే అవకాశముందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సీజన్లో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి పంపాలని బిగ్ బాస్ డిసైడైనట్లు సమాచారం. ఇందుకోసం అక్టోబర్ 7 (శనివారం) సీజన్ 7 గ్రాండ్ లాంఛ్ 2.0కు ప్లాన్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బీబీ సీజన్ 7 గ్రాండ్ లాంఛ్ రేంజ్లోనే ఈ ఈవెంట్ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ రోజున హోస్ట్ నాగార్జున ఏడుగురు కంటెస్టంట్లను ఇంట్లోకి పంపుతారని సోషల్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఈసారి మరికొందరు సీరియల్ నటుల్ని పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గుండమ్మ సీరియల్ ఫేం పూజామూర్తి, అంజలి పవన్, అంబటి అర్జున్ ఈ కేటగిరిలో హౌస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. వాస్తవానికి పూజా మూర్తి, అంజలి పవన్ షో ప్రారంభంలోనే వస్తారని అంతా భావించారు. అయితే తండ్రి చనిపోవడంతో పూజా మూర్తి, వ్యక్తిగత కారణాల వల్ల అంజలి పవన్ అప్పట్లో హౌస్లోకి వెళ్లలేకపోయారట. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో వారిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇక సింగర్ కేటగిరిలో భోలే షావలి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక నయని పావని ఇంట్లో గ్లామర్ డోస్ పెంచనుండగా.. యూట్యూబర్ నిఖిల్ సైతం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి బజర్థస్ షో నుంచి ఎవరూ బిగ్ బాస్లోకి రాలేదు. ఆలోటు పూడ్చేందుకు కెవ్వు కార్తీక్ను హౌస్లోకి పంపాలని డిసైడైనట్లు సమాచారం. నిజానికి వీరందరి పేర్లు కూడా బిగ్ బాస్ సీజన్ 7 లాంఛ్ సమయంలోనే వినిపించాయి. అయితే కొన్ని కారణాల వల్ల వారంతా హౌస్ లోకి వెళ్లలేకపోవడంతో గ్రాండ్ లాంఛ్ 2.0లో వారిని లోపలకు పంపి కంటెస్టెంట్ల ఆట గేరు మార్చాలని బిగ్ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

5 వారాల తర్వాత ఒకరిద్దరు కాకుండా ఏకంగా ఏడుగురు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుండటం ఆట మరింత ఇంట్రెస్టింగ్గా మారే ఛాన్సుంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారి ఆటతీరు చూసిన ఈ ఏడుగురు ఆటను ఎలాంటి మలుపు తిప్పుతారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.




Updated : 4 Oct 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top