తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్
X
అలనాటి నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ బ్రేక్ దర్శనం సమయంలో జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో.. వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అంద చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి దర్శనం తర్వాత శ్రీవారికి నమస్కారాలు చేస్తూ ఆలయం నుంచి బయటికి వచ్చారు జాన్వీ. ఆలయం నుంచి బయటికి వచ్చాక గుడి ముందు సాష్టాంగ నమస్కారాలు చేశారు. జాన్వీకి తిరుమల వెంకన్న అంటే చాలా ఇష్టం. ఏడాదిలో ఆమె చాలాసార్లు తిరుమలకు వస్తుంటారు. కొన్నిసార్లు కాలి నడకన సైతం వెళ్తుంటుంది. సోమవారం ఉదయం జాన్వీ లంగావోణిలో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిలా తయారై శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రస్తుతం జాన్వీ.. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంది జాన్వీ. ఇక ఇప్పుడు మరో షెడ్యూల్లో పాల్గొననుంది. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్. ఇందులో భాగంగా జాన్వీ దేవర తదుపరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొననుందని.. అదే సమయంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.