Bollywood Stars : షారుఖ్ సహా బాలీవుడ్ స్టార్స్కు నోటీసులు.. వాటిల్లో నటించడంపై..
X
గుట్కా, పొగాకు సంబంధిత యాడ్స్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20న ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే తెలిపారు. ప్రజారోగ్యానికి హానికరమైన కొన్ని ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొనడంపై న్యాయవాది మోతీలాల్ యాదవ్ అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 ఆగస్టులో కేబినెట్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే కోర్టుకు వివరణ ఇచ్చారు. పొగాకు కంపెనీల ఉత్పత్తుల్లో నటించిన నటులకు నోటీసులు జారీ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ తన కాంట్రాక్టును రద్దు చేసుకున్నప్పటికీ తన యాడ్ను ప్రదర్శించినందుకు పొగాకు కంపెనీకి లీగల్ నోటీసు పంపారని న్యాయస్థానానికి చెప్పారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను కొట్టేయాలని కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది.