అంబటికి బ్రో నిర్మాత కౌంటర్..
X
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల బ్రో చిత్రంపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. ఆ సినిమాలో తన స్టైల్ డ్యాన్స్ పెట్టి ఎగతాళి చేశారని మండిపడుతున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు రోజుకో విమర్శ చేస్తున్నారు. సినిమా అట్టర్ ప్లాప్ అంటూ కలెక్షన్ల లెక్కలు చెబుతున్నారు. ఆ సినిమా వెనక పెద్ద కుట్ర ఉందని, దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అంటున్నారు. దాని నిర్మాత టీడీపీకి దగ్గర అని, సినిమా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్‌పై తనూ ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటుగా స్పందిచారు.
‘‘మా బొమ్మ బ్లాక్ బస్టర్. సినిమా కలెక్షన్ల గురించి, పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన పారితోషికం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అంబటి రాంబాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. సినిమాకు సంబంధించి చెల్లించిన పన్నుల డాక్యుమెంట్లలో ఎలాంటి గోల్‌మాల్ లేదు. సంబంధిత ఆడిట్ సంస్థలు అడిగితే లెక్కలు చూపిస్తాం. వ్యక్తులుగా అడిగితే చూపాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఓటీటీ హక్కులు అమ్మకం ద్వారా బాగానే వసూలు చేసుకున్నామన్నారు. తమ సినిమాకు ఇలాంటి వ్యక్తుల వల్ల కోరుకొని పబ్లిసిటీ వస్తోందని, కలెక్షన్లు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీతో కుమ్మక్కై సినిమా తీశారన్న ఆరోపణలపై స్పందిస్తూ తనకు అన్ని పార్టీల్లోనూ మంచి మిత్రులు ఉన్నారన్నారు.
అసలు అంబటి ఈ సినిమాలై ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని విశ్వప్రసాద్ అన్నారు. ‘‘సినిమాతో అంబటికి సంబంధం ఏమిటి? సినిమాలోని శ్యాం బాబు చేసిన డాన్సుకు, సంక్రాంతి సంబరాలలో రాంబాబు చేసిన డాన్స్‌కు పోలికే లేదు. శ్యాంబాబు అంబటిలా రాజకీయ నాయకుడు. మ్యూజిక్ కూడా ఒకటి కాదు’’ అని అన్నారు. కాగా బ్రో మూవీపై మిశ్రమ స్పందన వస్తున్నా మూవీ ఇప్పటివరకు వందకు కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది.