Clarity ON Sankranthi Movies 2024 : సంక్రాంతి సినిమాల వివాదంపై మరోసారి వివరణ ఇచ్చిన నిర్మాతల మండలి
X
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాల పైన తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టి సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లను పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరడం జరిగింది. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం మరియు నా సామి రంగ. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి ఈగల్ సినిమా శ్రీ టీ. విశ్వ ప్రసాద్ గారు, వివేక్ గారు, కథానాయకులు శ్రీ రవి తేజ గారు సహకరించి ఫిబ్రవరి 9కి మార్చడం జరిగింది. ఒక మాస్ హీరో డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ వెనక్కి తగ్గడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఈ రోజుల్లో వ్యాపార పరంగా కూడా అంత సులువైన విషయం కాదు. అలా ఒక మాస్ హీరో ఇండస్ట్రీ బాగు కోసం ముందుకు వచ్చి సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం తద్వారా మిగతా మిగతా నలుగురికి సహకరించడం ఇండస్ట్రీకి ఆహ్వానించదగ్గ శుభపరిణామం. అదేవిధంగా సంక్రాంతి బరిలో హీరో శ్రీ రజనీకాంత్ గారు, శ్రీ ధనుష్ గారు సహకరించి వాయిదా వేయడం జరిగింది. శ్రీ శివ కార్తికేయన్ తమిళ్ సినిమా కూడ రిలీజ్ కి ఉండగా ఆ ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి సినిమాని 19 కి వాయిదా వేయించడం జరిగింది. సంక్రాంతి అంటే ఒక మంచి పోటీ సినిమాల మధ్య హెల్తీ వాతావరణం లో ఉంటుంది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడు కి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ మరియు ఇతర మీడియా కావాలనే సంక్రాంతి టైంలో వాళ్ల రేటింగ్లు, టిఆర్పిల కోసం ఇష్టమైన రాతలు, ఆర్టికల్స్ రాస్తూ సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య హీరోల మధ్య ప్రొడ్యూసర్ల మధ్య దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అలా ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే వెబ్సైట్స్, సోషల్ మీడియా, మరి ఏ మీడియా అయినను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. సోషల్ మీడియా, వెబ్సైట్స్ మరియు ఇతర మీడియా ఏదైనా
ఆర్టికల్స్ రాసే ముందు మా మూడు ఆర్గనైజేషన్స్ ని సంప్రదించి నిజాన్ని తెలుసుకుని వార్తలని ప్రచురించాల్సిందిగా తెలియజేయడమైనది. మీరు చెప్పాలనుకున్న వార్తలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పరిశ్రమలో అబద్ధపు వార్తలు ఇబ్బంది పెట్టే వార్తలు రాస్తూ ఎదుటివారి మనోభావాలను వ్యక్తిగతంగా ఈర్ష్య ద్వేషాలతో వారి ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. ఎవరన్నా ఆర్టిస్టులు గాని ప్రొడ్యూసర్లు గాని దర్శకులు కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలను పూర్తిగా వినకుండా తాత్పర్యాన్ని అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో పరిశ్రమని ఇబ్బంది పడే విధంగా ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు. ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మటుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరిశ్రమలో అనారోగ్యకరమైన, ఇబ్బందికర వాతావరణం కలగకూడదు. విడుదలయ్యే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలి పరిశ్రమ బాగుండాలి అనేది మా మూడు సంస్థల ప్రయత్నం. ఈ లేఖను ప్రతి జర్నలిస్ట్ అసోసియేషన్ కి మరియు మీడియా అసోసియేషన్ కి వారి యాజమాన్యాలకు పంపడం జరుగుతుంది. పరిశ్రమ పుట్టినప్పటి నుండి తెలుగు సినీ పరిశ్రమకు మీడియాతో అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకమీదట ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే వారి పైన తెలుగు జర్నలిస్ట్ మరియు మీడియా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా యావత్ తెలుగు సినీ పరిశ్రమ తరఫున కోరడమైనది.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి
(కె.యల్. దామోదర్ ప్రసాద్) (కె. అనుపమ్ రెడ్డి)
గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి
(తుమ్మల ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి