షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు.. భద్రత పెంచిన ప్రభుత్వం
X
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటంచిన తాజా చిత్రం.. జవాన్ (Jawan). గత నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. కలెక్షన్లు ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. రెడ్ ఛిల్లీస్ పతాకంపై గౌరవ్ వర్మ, గౌరీ ఖాన్ సంయుక్తంగా దీన్ని నిర్మించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన సినిమాల కలెక్షన్లు వెయ్యి కోట్ల మార్క్‌ను దాటుకోవడం వరుసగా రెండోసారి. గతంలో పఠాన్ (Pathaan) సినిమా కూడా భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఏళ్లుగా హిట్టులేక సతమతమవుతున్న షారుఖ్‌కు ఈ రెండు సినిమాలు మంచి బూస్టప్ ఇచ్చాయి. ప్రస్తుతం అదే జోష్‌తో రాజ్ కుమార్ హిరానీతో కలిసి డంకీ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హిందీ ఆడియెన్స్ సహా సౌత్ ప్రేక్షకులు కూడా తెగ ఎగ్‌జైట్‌మెంట్‌కు గురవుతున్నారు.
ఈ రెండు సినిమాల తరువాత షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, డెత్ నోట్స్ అధికం అయ్యాయి. ఆయనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అందాయి. ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ రావడం మొదలుపెట్టాయి. దీనిపై షారుఖ్ ఖాన్ ఇప్పటికే ముంబై పోలీసులకు (Mumbai Police) ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. షారుఖ్ ఖాన్‌కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. వై ప్లస్ (Y +) గా మార్చింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతకు సంబంధించిన ఖర్చును షారుఖ్ ఖాన్ చెల్లించనున్నారు. ఈ Y+ భద్రతలో ఆరుగురు పోలీసు కమాండోలు, MP-5 మెషిన్ గన్‌లు, AK-47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్ వంటి ఆయుధాలుతో పోలీసులు షారుఖ్‌ఖాన్‌కు అంగరక్షకులుగా ఉంటారు.