ప్రభాస్ ఫ్యాన్స్ కు నరకం చూపిస్తున్నారు
X
డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. అయితే ఈ మూవీ టికెట్స్ కోసం ఆన్ లైన్ లో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు ఫ్యాన్స్. మరి ఏమైందో కానీ.. నైజాంలో ఆన్ లైన్ బుకింగ్స్ లేవు.. థియేటర్స్ దగ్గరే కొనుక్కోవాలని చెప్పారు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రీ వాళ్లు. పైగా కొన్ని థియేటర్స్ ను సెలెక్ట్ చేసి అక్కడ టికెట్స్ డైరెక్ట్ గా వెళ్లి తీసుకోవాలని చెప్పారు. అంటే ఫ్యాన్స్ అంతా పొలోమని థియేటర్స్ దగ్గర క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఆ క్యూ మెల్లగా వందలు దాటి వేలకు చేరింది. దీంతో అభిమానులను అదుపు చేయడం థియేటర్ యాజమాన్యాల వల్ల కాలేదు. మరోవైపు ఫ్యాన్స్ వల్ల ట్రాఫిక్ కూ తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీస్ లు రంగ ప్రవేశం చేశారు. రద్దీ ఎక్కువగా థియేటర్స్ వద్ద ఎలాంటి వార్నింగ్స్ లేకుండా ఫ్యాన్స్ కు వాయగొట్టారు. అదేదో దొంగలు, తీవ్రవాదులపై చేస్తున్న రేంజ్ లో లాఠీ చార్జ్ చేసి ఫ్యాన్స్ చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు అభిమానులకు గాయాలు కూడా అయ్యాయి.
నిజానికి ఇంత పెద్ద సినిమాలకు సంబంధించి థియేటర్స్ వద్ద టికెట్స్ అమ్మాలనే నిర్ణయం సరైంది కాదు. ఖచ్చితంగా దీన్ని అనాలోచిత చర్యగానే చూడాలి. పోనీ దీన్నైనా కొనసాగించారా అంటే అదీ లేదు. మళ్లీ రాత్రి 8 గంటల తర్వాత ఆన్ లైన్ లో టికెట్స్ అమ్ముతాం అని ప్రకటించారు. దీంతో ఆల్రెడీ థియేటర్స్ దగ్గర దెబ్బలు తిన్నవాళ్లు, చొక్కాలు చించుకున్నవాళ్లకు నో టికెట్స్ అనే బోర్డ్ దర్శనమిచ్చింది. సలార్ లో ఖాన్సార్ ఎరుపెక్కాలా అనే ప్రభాస్ డైలాగ్ కు న్యాయం చేస్తూ.. సలార్ కోసం థియేటర్స్ లో ఫ్యాన్స్ ఒళ్లంతా లాఠీ దెబ్బలతో ఎరుపెక్కడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.