హోరాహోరీ పోరులో ఎన్నికలు పూర్తి.. దిల్ రాజు విజయం
X
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరుగగా.. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ల నుంచి 1600 మంది సభ్యులు ఓటుహక్కు వినియోగించుకునున్నారు. అధ్యక్ష బరిలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడ్డాయి. కాగా, సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ముగిసింది.
మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు నుంచి దిల్ రాజు ప్యానెల్ ఆధిపత్యం చూపించింది. మొత్తం 14 రౌండ్లు జరుగగా దిల్ రాజు ప్యానెల్ కు 563 ఓట్లు రాగా.. సి కళ్యాణ్ ప్యానెల్ కు 497 ఓట్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్ లో ఇరు వైపుల నుంచి సమానంగా ఆరుగురు చొప్పున గెలుపొందారు. స్టూడియో సెక్టార్ లో నలుగురికి గానూ దిల్ రాజు ప్యానెల్ నుంచి ఏకంగా ముగ్గురు విజయం సాధించారు. నిర్మాతల విభాగంలో 12 మంది నిలుచోగా దిల్‌రాజు ప్యానెల్ నుంచి ఏడుగురు గెలిచారు. దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లను విజయం వరించింది.