డ్రగ్స్ కేసు అప్డేట్.. హైకోర్టులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్
X
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ దర్శకుడు క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని తనను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో చెప్పారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా పడింది.
ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నాడు. ఈ కేసులో ఆయన ఏ10గా ఉన్నాడు. కాగా ఈ పార్టీలో క్రిష్ తో పాటు.. శ్వేత, లిసి, నీల్, సందీప్ కూడా కొకైన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన ప్రతీసారి క్రిష్, నిర్భయ్ రాడిసన్ హోటల్ లో కలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి 1 గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. క్రిష్ ను కూడా నిందితుడిగా చేర్చారు. తర్వాత విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరగా.. దీనికి క్రిష్ తొలుత ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తనకు రెండు రోజుల గడువు కావాలని మార్చి 1న హాజరవుతానని చెప్పాడు. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు.