రాకేష్ మాస్టర్ మృతిపై డాక్టర్ల ప్రకటన.. ఏం చెప్పారంటే..?
X
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను డాక్టర్లు వివరించారు. ‘‘ రక్త విరోచనాలు అవుతున్నాయని ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన్ని గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిక్ పేషెంట్ అవడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఆయన్ని బతికించేందుకు డాక్టర్లు ఎంత కృషి చేసిన ఫలించలేదు. సాయంత్రం 5గంటలకు రాకేష్ మాస్టర్ మృతి చెందారు’’ అని డాక్టర్లు ప్రకటించారు.
కాగా రాకేష్ మాస్టర్ 1968లో తిరుపతిలో జన్మించారు. ఆట ప్రోగ్రాంతో తన డ్యాన్స్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్‌గా ఎదిగారు. ప్రముఖ చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫీ అందించారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు వంటి సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు రాకేష్ మాస్టర్ శిష్యులే.
అయితే కొన్నేళ్లుగా రాకేష్ మాస్టర్ డ్యాన్స్ పరంగా యాక్టివ్గా లేరు. యూట్యూబ్ ఛానెల్స్ లో ఆయన చేసే కామెంట్స్ వైరల్ అవడంతోపాటు పలు వివాదాస్పద సంఘటనలు ఆయన్ను చుట్టుముట్టాయి. తన తోటి డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ వల్లే తన కెరీర్ నాశనం ఐయ్యిందని కూడా రాకేష్ మాస్టర్ తరచుగా చెబుతుంటారు. అంతేకాకుండా అనేక వ్యసనాలు రాకేష్ మాస్టర్ ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశాయనే ప్రచారం ఉంది. ఇక పలువురు ప్రముఖులు రాకేష్ మాస్టర్ మృతికి సంతాపం ప్రకటించారు.