ఓటీటీలోకి షీనా బొరా హత్య కేసు డాక్యుమెంటరీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X
షీనా బోరా హత్య కేసు..అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసుపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ పేరుతో రూపొందించింది. అయితే గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. షానా లెవీ, ఉరాజ్ బహల్ కీలక పాత్రలు పోషించిన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ ప్రసారమవుతోంది.
2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన బయటికి వచ్చింది. ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ హత్య విషయాన్ని బట్టబయలు చేశాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని విచారణలో తెలిపాడు. ఇంద్రాణీ తన మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచింది. మరి కొన్నాళ్లకు సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెండ్లి చేసుకొని అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాను మూడో పెండ్లి చేసుకుంది. తర్వాత ఇంద్రాణి కుమార్తె షీనా ముంబైకి వెళ్లి ఆమెను కలిసింది. అయితే పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్‌తో షీనా ప్రేమలో పడింది. ఈ విషయంలో తల్లి కూతుర్ల మధ్య తరచూ గొడవలు అవుతుండేవి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కూతురు షీనాను చంపేసినట్లు దర్యాప్తులో తెలిసింది.
అయితే ముందుగా ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని సదరు ఓటీటీ సంస్థ అనుకుంది. కానీ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టుకు దాఖలు చేసింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. దర్యాప్తు సంస్థతోపాటు కోర్టుకు కూడా..ముందస్తుగా డాక్యుమెంటరీని ప్రదర్శించాలని నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.