దోస్తాంగీ.. ‘మట్టికథ’ నుంచి అద్భుతమైన లిరికల్ సాంగ్ వచ్చేసింది..
X
తెలుగు వెండితెర రియాలిటీకి పట్టడం కడుతోంది. ఇంతవరకు సెల్యూలాయిడ్‌పై కనిపించని ముడిజీవితపు కథలను కొత్త దర్శకులు అద్భుతంగా పరిచయం చేస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ‘మట్టికథ’ చిత్రం అటువంటిదే. విడుదల కాకముందే అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం పల్లెటూరి కుర్రకారు ఆశనిరాశలను, ప్రేమలను, సరదాలను సరికొత్తగా కళ్లకు కడుతుంది. ఈ చిత్రంలోని ‘దోస్తాంగీ’ లిరికల్ పాటను మూవీ టీమ్ కాసేపటి కిందట విడుదల చేసింది.
‘‘ఏమిరా సత్తీ ఎట్టుంది పాఠం ఏమైన ఎక్కినదా
నెత్తి మొత్తం తిప్పుతాంది ఏందిరా ఈ గొడవా..
లైఫు లెక్కలూ అవి వేరే సిక్కులూ
ఇడిసి బుక్కులూ దునుకురా కళలందే గోడలూ ..
కుదురు మరచినద దోస్తాంగీ.. తెగిందీ పతంగీ
దారి తప్పినది దోస్తాంగీ.. పేలిందీ ఫిరంగీ..’’
అంటూ సరదాగా సాగుంతుంది ఈ పాట. అర్థం కాని కాలేజీ చదువులు, కుర్రతనం కోరికలు, అల్లరిపనులను చక్కగా చిత్రీకరించారు. నిఖిలేశ్ సుంకోజీ రాసిన ఈ పాటకు స్మరణ్ సాయి స్వరాలు అందించి, రాజశేఖర్ కట్లకుంటతో కలసి పాడారు. పవన్ కడియాల దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సహనిర్మాత సతీశ్ మంజీర. అజయ్ వేడ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించగా కుంభం ఉదయ్ ఎడిట్ చేశారు.