Home > సినిమా > పాంచ్ పటాకా కాదు.. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలివే..!

పాంచ్ పటాకా కాదు.. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలివే..!

పాంచ్ పటాకా కాదు.. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలివే..!
X

సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. కోడిపందాల హవా ఒకవైపు.. వెండితెర రేసు మరోవైపు. ఈసారి పంగడకు కూడా ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటన్నింటికి థియేటర్లు దొరకడం కష్టమే. ఈ క్రమంలో కొన్ని సినిమాలు రేసు నుంచి తప్పుకున్నాయి. ఇంతకీ ఈసారి వెండితెరపై సంక్రాతి బరిలో నిలిచే చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం

ఈ ఏడాది సంక్రాంతి బరిలో పాంచ్ పటాకా ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రవితేజ నటించిన ఈగల్ మూవీ బరి నుంచి తప్పుకుంది. జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒకటి స్టార్‌ హీరో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ కాగా.. మరొకటి యువ హీరో తేజా సజ్జా నటించిన ‘హను–మాన్‌’. మహేశ్‌ బాబు–దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా’ తర్వాత తెరకెక్కిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. మూవీలో మహేశ్‌ బాబు పక్కా మాస్‌ లుక్‌లో కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు స్పష్టం చేశాయి. అమ్మ సెంటిమెంట్‌, పోలిటికల్‌ టచ్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

ఇక జనవరి 12న యువ హీరో తేజ సజ్జా ‘హను–మాన్‌’ సినిమాతో తొలిసారి సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ‘జాంబీ రెడ్డి’ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రమిది. కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌. ఓ కుర్రాడికి హనుమంతుని ఆశీస్సులతో సూపర్‌ పవర్స్‌ వస్తే అతను చేసే అసాధారణ పనులు ఏంటన్న నేపథ్యంలో ‘హను–మాన్‌’ తెరకెక్కింది.

ఇక సీనియర్‌ హీరోలు వెంకటేశ్, రవితేజ సంక్రాంతికి ఒకే రోజు విడుదలకు సిద్ధంకాగా.. తాజాగా రవితేజ బరి నుంచి తప్పుకున్నాడు. దీంతో జనవరి 13న వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సైంధవ్‌’ రిలీజ్ కానుంది. వెంకటేశ్కు ఇది తొలి పాన్‌ ఇండియన్‌ సినిమా కావడం విశేషం. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా, బేబీ సారా కీలక పాత్ర పోషించారు. ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘సైంధవ్‌’ వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ నెలకొంది. తండ్రీ - కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.

హీరో నాగార్జున కూడా ‘నా సామిరంగ’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) చిత్రాలతో గతంలో సంక్రాంతి రేసులో నిలిచి విజయం అందుకున్న ఆయన ఈసారి కూడా ‘నా సామిరంగ’తో జనవరి 14న ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌. ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. రెండు సంక్రాంతి పండగలకు హిట్‌ సాధించిన హీరో కావడంతో ఈసారి కూడా నాగార్జున ‘నా సామిరంగ’పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే సంక్రాతి బరి నుంచి తప్పుకున్న రవితేజ.. పండుగ విజేత ఎవరో తేలిన తర్వాత వెండితెరపై అలరించనున్నాడు. జనవరి 26న పెద్ద సినిమాలేవీ రేసులో లేకపోవడంతో ఈగల్ ను అదే రోజు విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 13న ఈ మూవీని విడుదల చేయాలని అనుకున్నందున ఇప్పటికే కొన్ని థియేటర్లు ‘ఈగల్’ షో బుకింగ్స్ మొదలుపెట్టాయి. తాజాగా మూవీ పోస్ట్‌పోన్ కావడంతో ‘ఈగల్’ షో వేయాలనుకున్న థియేటర్లలో ఇప్పుడు ‘నా సామిరంగ’ బొమ్మ పడనుంది.


Updated : 4 Jan 2024 10:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top