Pushpa3 Movie : అల్లుఅర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పుష్ప నుంచి మూడో పార్ట్!
X
(Pushpa3) టావీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా పార్ట్ 2 రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పుష్ప మూవీకి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీ కేవలం రెండు భాగాలు మాత్రమే కాదని మూడో పార్ట్ కూడా ఉందని తెలుస్తోంది.
పుష్ప..ది రూల్ పేరుతో సెకండ్ పార్ట్ తెరకెక్కితే ఆ తర్వాత జరిగే చివరి ఘట్టాన్ని పుష్ప..ది రోర్ పేరుతో మూడో పార్ట్ రూపొందించనున్నారట. ఈ మూడో పార్టుతోనే పుష్ప మూవీకి ఎండ్ టైటిల్ వేయనున్నారట. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప3 మూవీపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే అల్లుఅర్జున్, సుకుమార్, మైత్రిమూవీ మేకర్స్ మూడో పార్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారట. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఆగస్టు 15వ తేది వరకూ ఎదురుచూడాల్సిందే.
ఆగస్టు 15వ తేదిన పుష్ప2 మూవీ విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అందుకోసమే నాన్ స్టాప్‌గా షూటింగ్‌ను జరుపుతున్నారు. గతంలోనే సుకుమార్ దీన్నొక వెబ్ సిరీస్ లాగా రాసుకున్నారట. అయితే బన్నీకి కాన్సెప్ట్ నచ్చాక సినిమా నిడివికి తగినట్టు మార్పులు చేశారట. అయితే ఫ్రెష్‌గా అవుట్‌ఫుట్ చూశాక దాన్ని మరింత విస్తరించేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లుఅర్జున్ ఈ మూవీ కోసం పొడవాటి జుట్టును పెంచుకున్నారట, భవిష్యత్తులో పుష్ప3 చేయాలన్నా మళ్లీ ఆ స్థాయిలో జుట్టు పెంచడం కొంత కష్టం. అందుకే పుష్ప3 కూడా చేసేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. మూడో భాగంలో ఇప్పటి వరకూ పరిచయం కానీ కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తాయట. అయితే పుష్ప3 మూవీపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.