Guntur Kaaram MOVIE Review రివ్యూ : గుంటూరు కారం
X
తారాగణం : మహేష్, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం, వెన్నెల కిశోర్, మురళీశర్మ, జగపతిబాబు, సునిల్, ఈశ్వరీ రావు తదితరులు..
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, పిఎస్ విందా
సంగీతం : తమన్ ఎస్
నిర్మాత : ఎస్ రాధాకృష్ణ
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులే. తర్వాత టివిల్లోనూ, యూ ట్యూబ్ లోనూ ఆకట్టుకున్నాయి. అప్పుడు కమర్షియల్ గా రెండూ వర్కవుట్ కాలేదు. ఖలేజా తర్వాత 13యేళ్లకు ఇప్పుడు గుంటూరు కారంతో వచ్చారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు వరకూ పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో బజ్ క్రియేట్ అయింది. అంచనాలూ పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ టీమ్ అందుకుందా లేదా అనేది చూద్దాం..
కథ :
పెద్దగా కథంటూ ఏం లేదు. వెంకట రమణ(మహేష్ బాబు) గుంటూరులో ఉంటూ మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. తల్లి(రమ్యకృష్ణ) చిన్నప్పుడే రమణని అతని తండ్రి(జయరాం) వదిలేసి వెళ్లిపోయి మరో పెళ్లి చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె మంత్రి. పాతికేళ్ల తర్వాత తల్లి ఇంటి నుంచి ఒక నోట్ వస్తుంది.దానిపై సంతకం చేయమని అడుగుతాడు రమణ తాత, అతని తల్లికి తండ్రి(ప్రకాష్ రాజ్). ఆ కాగితాలేంటీ..? అతని తల్లి ఎందుకు వెళ్లిపోయింది.. మళ్లీ తిరిగి వచ్చిందా లేదా అనేది మిగతా కథనం.
ఎలా ఉంది..?
త్రివిక్రమ్ సినిమా అంటే ఆడియన్స్ లో ఒక ముద్ర ఉంది. అవన్నీ ఒక టెంప్లేట్ ప్రకారం సాగుతాయి. బలమైన కథ లేకపోయినా ఆకట్టుకునే కథనం ఉంటుంది. మంచి డైలాగ్స్ ఉంటాయి. పంచ్ లూ పేలతాయి అని. కొన్ని ఎమోషన్స్ తో మెప్పిస్తాయి. ఇప్పటి వరకూ వరకూ వీటితోనే నెట్టుకొచ్చాడు త్రివిక్రమ్. అయినా ఆ సినిమాల్లో కాస్త కథ, కథనం కనిపించేది. బట్ ఫస్ట్ టైమ్ ఈ రెండు విషయాల్లో వీక్ అయిపోయాడు. అలాంటివేం కనిపించకూడదు అనే రూల్ పెట్టుకున్నట్టుగా వీక్ స్టోరీ, వీకెస్ట్ నెరేషన్ తో తనెంత వీక్ అయిపోయాడో చెప్పకనే చెప్పాడు. మహేష్ బాబు ఎంటర్ అయ్యే సీన్ నుంచి మొదలైతే చివరి వరకూ కాస్త కొత్తదనం ఉన్న సీన్ ఒక్కటీ ఉండకూడదు అనే రూల్ ను అచ్చంగా ఫాలో అయిపోయాడు. కుర్చీని మడతపెట్టి అనే పాటతో ఆల్రెడీ అభాసుపాలైన త్రివిక్రమ్ ఇప్పటికే అందరూ వాడేసి, పక్కన పడేసిన పలాస పాటను కూడా వదల్లేదు. నీ పక్కన పడ్డాది లేదోలె పిల్లా అనే పాటకు మళ్లీ మహేష్ తోనూ స్టెప్పులు వేయించాడు. దీన్ని బట్టే అతనిలో సరుకు అయిపోయిందన్న విషయం అర్థం అవుతుంది.
ఒక స్టార్ హీరో తల్లి వేరే వాడిని పెళ్లి చేసుకోవడం.. ఒక బిడ్డను కూడా కన్నది అని సమాజాన్ని మెప్పించడం..పాతికేళ్ల కాపురం తర్వాత తనేం తప్పు చేయలేదు.. అని ఆమె రెండో భర్తతో చెప్పించడం అనే దారుణాలు త్రివిక్రమ్ ఆలోచన స్థాయిని ప్రశ్నిస్తున్నాయి. సామాజికంగా అతనెంత వెనకబాటుతనంతో ఉన్నాడో కూడా చెబుతాయి. దీనికి ప్రకాష్ రాజ్ పాత్రను వాడుకున్న విధానం, రమ్యకృష్ణ ఆఖర్లో వచ్చి అస్సలేం జరగలేదు అన్నట్టుగా భర్తతో కలిసిపోవడం.. అతనేమో ఇంకా ఆమె జ్ఞాపకాల్లో ఉన్నానని అదో రకం తాత్వికతతో చెప్పడం చూస్తే బాబోయ్.. ఈయన రాముడి కంటే గొప్పోడ్రా బాబూ అనిపించక మానదు.
ఎవరెలా చేశారు.. ?
ఇలాంటి సినిమాలు కొన్నిసార్లు చివరి 20 నిమిషాల్లో ఏదో మ్యాజిక్ చేస్తాయి. అత్తారింటికి దారేదీ సెకండ్ హాఫ్ మైనస్ అనిపించినా.. క్లైమాక్స్ తో మళ్లీ నిలబడింది. త్రివిక్రమ్ ఈ చివరి ఆశలను కూడా వదిలేశాడు. మహేష్, రమ్యకృష్ణ మధ్య వచ్చే డైలాగ్స్ లో ఏ ఎమోషన్ కనిపించదు. అసలు వాళ్లు మాట్లాడుతుంటే తల్లి, కొడుకులు అనే భావన ఏ కోశానా కలగదు. ఒకవేళ ఎక్కడైనా కలుగుతుందని భయపడ్డాడేమో.. వారి మధ్య డైలాగ్స్ చాలా చీప్ టోన్ లో రాశాడు త్రివిక్రమ్.
ఇక లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరవింద సమేతలో లాయర్ కూతురు ట్రాక్ నే కాస్త అటూ ఇటూగా పెట్టేశాడు. ఆ పాత్రల్లో శ్రీ లీల, మురళీ శర్మ, వెన్నెల కిశోర్.. అస్సలే మాత్రం కొత్తదనం లేని పాత్రలో నిజాయితీగా కనిపించే ప్రయత్నం చేశారు. జగపతిబాబు రోల్ అయితే బఫూన్ లా ఉంటుంది.
ప్లస్ లు ఏంటీ..?
ఈ మొత్తంలో అందరికంటే చాలా సీరియస్ గా సిన్సియర్ గా కనిపించింది మహేష్ బాబు మాత్రమే. రమణగాడు అనే పాత్రను అతను ఓన్ చేసుకున్నాడు. గుంటూరు స్లాంగ్ ను బాగా పట్టుకున్నాడు. చాలా ఫ్లెక్సిబుల్ గా నటించాడు. బాడీ లాంగ్వేజ్ లో ఈజ్ తో పాటు డైలాగ్స్ లో విరుపుతో ఆకట్టుకున్నాడు. బట్ అతని కష్టంలో కారం కొట్టాడు త్రివిక్రమ్.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. తమన్ పాటలేవీ పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం అతని సినిమాల్లోనే చాలాసార్లు విన్నట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా మిల్లులో వచ్చే పాటతో పాటు సెకండ్ హాఫ్ లోని మూడు నాలుగు సీన్స్ తీసేయొచ్చు. హారిక హాసిని బ్యానర్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఆర్ట్ వర్క్, సెట్స్, కాస్ట్యూమ్స్ బావున్నాయి.
ప్రతిసారీ డైలాగ్స్ తో ఎక్కువ మార్కులు కొట్టేసే త్రివిక్రమ్ ఈ సారి అక్కడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. పూర్తిగా ఎమోషన్ లెస్ గా సాగిన ఈ గుంటూరు కారం చూస్తే అమ్మగారింటికి దారేదీ అన్న టైటిల్ అయితే బావుండేదనిపిస్తుంది. మొత్తంగా గురూజీలో గుజ్జు అయిపోయినట్టే అనొచ్చా.. అంటేఅనొచ్చేమో..
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం
దర్శకత్వం
డైలాగ్స్
యాక్షన్ సీన్స్
సంగీతం
ఫైనల్ గా :గుంటూరు ఎర్రకారం బిర్యానీలో దమ్ లేదు, ఘాటూ లేదు.