Drugs Case Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. పరారీలో సినీ నటుడు నవదీప్
X
మాదాపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాజా విచారణలో ఈ కేసులో హీరో నవదీప్ తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి భాగమైనట్లు తేలింది. కాగా నార్కోటిక్స్ అధికారులు నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. నవదీప్ పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ ఉన్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. ప్రస్తుతం నవదీప్ కోసం గాలిస్తున్నట్లు.. అతని స్నేహితుడు రాంచంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. రాంచంద్ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.
అంతేకాకుండా షాడో సినిమా ప్రొడ్యూజర్ రవి ఉప్పలపాటి కూడా నిందితుడిగా తేలడంతో.. అతను కూడా పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా గతంలో కూడా నవదీప్ డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కున్నాడు. ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా హాజరయ్యాడు. ఈ కేసులో పోలీసులు 50 గ్రాముల MDMA తో పాటు 8 గ్రాముల కొకైన్ ,24 ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ రాగా.. ఓ ఆర్గనైజర్ ను ఏర్పాటు చేసుకుని సిటీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొందరు నైజీరియన్లు వీసా గడువు ముగిసినా దేశంలోనే అక్రమంగా ఉంటున్నారు. వాళ్లలో కొందరు అనుమానస్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.