చివరికి ఒప్పుకున్న రాజశేఖర్
X
ఒకప్పుడు యాంగ్రీమేన్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న హీరో రాజశేఖర్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో స్టార్ హీరోగా వెలిగాడు. తన తరం హీరోల్లో కొందరు ఎప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అయినా తను మాత్రం ఇప్పటికీ హీరోనే అంటూ ఆగిపోయాడు. హీరోగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా వేరే పాత్రలకు షిఫ్ట్ కాలేదు. అలా అతను చాలామంచి పాత్రలే మిస్ చేసుకున్నాడు. గరుడవేగ బ్లాక్ బస్టర్ కావడంతో బౌన్స్ బ్యాక్ అయినట్టే అనుకున్నారు. తర్వాత చేసిన కల్కి కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా అతని ఇమేజ్ కు తగ్గ కథే. బట్ చివరగా వచ్చిన మళయాల రీమేక్ శేఖర్ తో షాక్ తిన్నాడు. దీంతో రీ థాట్ లో పడినట్టున్నాడు. ఆ థాట్ సరిగ్గా పనిచేసినట్టే ఉంది. ఫస్ట్ టైమ్ మరో హీరో సినిమాలో కీలక పాత్రకు ఓకే చెప్పాడు.
నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న ‘ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు రాజశేఖర్. ఈ సోమవారం నుంచి ఆయన సెట్స్ లో అడుగపెట్టాడు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. అయితే చాలామంది భావించినట్టుగా ఇది ఓల్డ్ ఏజ్ రోల్ కాదు అని అతని మేకప్ చూస్తే తెలుస్తోంది. ఈ లుక్ పూర్తిగా రాజశేఖర్ ఇమేజ్ కు తగ్గట్టుగానే కనిపిస్తుండటం విశేషం. అయితే లుక్ ఎలా ఉన్నా.. ముందు క్యారెక్టర్స్ చేయడానికి రాజశేఖర్ ఒప్పుకున్నాడు అని తేలిపోయింది. ఇకపై కీలకమైన పాత్రల్లో ఆయన్ని ఉద్దేశిస్తూ కథలు రాసుకుంటారు చాలామంది.
ఇక ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్’ లో నితిన్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలేసే జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర చేస్తున్నాడు అని ముందు నుంచీ వినిపిస్తోంది. అది నిజమా కాదా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు. మొత్తంగా రాజశేఖర్ - నితిన్ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.