ఎమోషన్ లెస్ 'ఆదిపురుష్' .. నటుడు సుమన్
X
రాముడి పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు, సీనియర్ హీరో సుమన్ ఆదిపురుష్ సినిమా పై ఆసక్తికర కామెంట్లు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో .. ‘రావణాసురుడు సీతను అపహరించడం నుంచి రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ సినిమాను తీశారు. ఇక మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో రాముడికి మీసాలు, గడ్డాలు అస్సలు ఉండవు. అయితే ఇందులో రాముడిని అసాధారణంగా చూపించి ఎంతో పెద్ద రిస్క్‌ను చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ను మాత్రం మెచ్చుకోవచ్చు. సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఆ బాడీని మెయింటైన్ చేయడం అంత చిన్న విషయం అయితే కాదు. అందుకు ప్రభాస్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.. కానీ సినిమాలో డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు మాత్రం అంతగా మెప్పించలేక పోయాయి.
రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు. వేషధారణ మార్చారు. అది చాలా తప్పు. ఇలా డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఇక గ్రాఫిక్స్ కూడా కొన్ని చోట్ల ఎంతో అద్భుతంగా ఉన్నా.. మరికొన్ని చోట్ల అంతగా మెప్పించే విధంగా లేవు. జానకిగా కృతిసనన్ అద్భుతంగా చేసింది. అయితే సినిమాలో చాలా వరకు ఎమోషన్ డ్రామా మిస్ అయ్యినట్లు కనిపించింది. ఈ సినిమాకు ఆదిపురుష్ అని అద్భుతమైన టైటిల్ పెట్టారు. కానీ సినిమాను మాత్రం ప్రేక్షకులను మెప్పించే విధంగా తీయలేదు. సినిమాను చూసి నేనూ ఎంతో నిరాశ చెందాను. ఇలాంటి పౌరాణిక సినిమాలను దక్షిణాది దర్శకులు ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు’ అని సుమన్ చెప్పుకొచ్చారు.