Home > సినిమా > Hi Nanna Review : రివ్యూ : హాయ్ నాన్న

Hi Nanna Review : రివ్యూ : హాయ్ నాన్న

Hi Nanna Review : రివ్యూ :  హాయ్ నాన్న
X

తారాగణం ః నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియార ఖన్నా, జయరాం, ప్రియదర్శి, అంగద్ బేడీ తదితరులు

ఎడిటర్ ః ప్రవీణ్ ఆంటోనీ

సినిమాటోగ్రఫీ ః షాను వర్ఘీస్

సంగీతం ః హేషమ్ అబ్దుల్ వాహబ్

నిర్మాతలు ః మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి, తీగల మూర్తి కేఎస్

దర్శకత్వం ః శౌర్యువ్

నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ఫ్యామిలీ ప్యాక్. కొన్నాళ్లుగా తన సెటిల్డ్ ఆడియన్స్ ను దాటి మాస్ ను మెప్పించే కథలు ప్రయత్నిస్తున్నాడు. బట్ ఇవంతగా వర్కవుట్ కావడం లేదు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించేలా హాయ్ నాన్న అనే సినిమా వచ్చాడు. ముందు నుంచీ ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపించుకుందీ సినిమా. శౌర్యు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

కథ ః

విరాజ్(నాని) ముంబైలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. తనకి ఓ కూతురు మహి(కియారా ఖన్నా) ఉంటుంది. మహి ఒక పుట్టడంతోనే ప్రాణాంతకమైన వ్యాధితో పుడుతుంది. కొన్ని రోజుల్లోనే చనిపోతుందనుకున్న మహిని కంటికి రెప్పలా కాపాడి.. ఆరేళ్ల పాప వరకూ తెచ్చుకుంటాడు. అయితే మహి తన తల్లి గురించి పదేపదే అడుగుతుంది. తనకు కథలు చెబుతున్నప్పుడల్లా అమ్మ పాత్రను స్కిప్ చేస్తాడు విరాజ్. తను క్లాస్ ఫస్ట్ వస్తే అమ్మ కథ చెబుతా అని ప్రామిస్ చేసి నిలబెట్టుకోడు. దీంతో కోపంతో ఇంటినుంచి వెళ్లి ప్రమాదం బారిన పడబోతోన్న మహిని యష్ణ(మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. దీంతో యష్ణకు తన కథంతా చెబుతుంది. విరాజ్ కు మహి అడ్రెస్ చెప్పి రమ్మంటుంది. అక్కడికి వచ్చిన మహి తండ్రి ప్రామిస్ మేరకు కథ చెప్పమంటుంది. అప్పటి తండ్రి చెప్పే కథల్లో అతనితో పాటు మిగతా వారిని ఊహించుకున్న మహికి ఫస్ట్ టైమ్ తల్లి పాత్రలో ఎవరిని ఊహించుకోవాలా అనుకున్నప్పుడు యష్ణ తనను ఊహించుకోమంటుంది. అలా మొదలైన కథ ఏ తీరాలకు చేరింది. విరాజ్ భార్య ఎవరు.. పుట్టిన కూతురును విడిచి ఎందుకు వెళ్లింది..? యష్ణ ఎవరు..? యష్ణ తర్వాత వీరి జీవితంలోకి ఎలా వచ్చిందీ అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

కొన్ని కథలు మొదలు కాగానే దాని తీరం ఏంటనేది తెలిసిపోతుంది. కాకపోతే ఆ తీరం చేరేవరకూ ఎంత ఆసక్తికరంగా ఆ ప్రయాణం ఉందనేదానిపైనే వాటి విజయం ఆధారపడి ఉంటుంది. హాయ్ నాన్న కూడా అంతే. సింగిల్ పేరెంట్ గా నాని, కూతురుగా మహి పాత్రలు మొదలవుతాయి. వీరి మధ్య అనుబంధంతో పాటు మహికి ఉన్న సమస్య గురించి ఎక్కువ టైమ్ తీసుకోకుండా వెంటనే చెప్పేస్తాడు దర్శకుడు. దీంతో తను ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుందని.. ఎక్కువరోజులు బతకదని తెలుస్తుంది. ఆ సింపతీ ఆడియన్స్ వరకూ పూర్తిగా చేరిందా అంటే చెప్పడం కష్టమే. ఈ కథలోకి యష్ణ వచ్చిన తర్వాత కాస్త వేగం అందుకుంటుందా అనుకుంటే.. అదీ లేదు. విరాజ్ భార్య 'హర్ష' గా తనను ఊహించుకోమనడంతో ఆ కథలోకీ మృణాల్ ఠాకూర్ వస్తుంది. కూనూర్ లో స్టార్ట్ అయిన ఈ ప్రేమకథ ఏమంత ఆసక్తిగా అనిపించదు. హర్షకు ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండదు. అయినా విరాజ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ ఒప్పుకుంటుంది. బట్ కూతురు పుట్టిన తర్వాత డిప్రెస్ అవుతుంది. ఆ డిప్రెషన్ లోనే ఓ ప్రమాదం జరగడంతో తను విరాజ్ జీవితం నుంచి వెళ్లిపోతుంది.

ఒక రకంగా చాలా ఎమోషనల్ గా సాగాల్సిన ఈ కథనం సాధారణంగా సాగుతుంది. అందుకు కారణం ప్రేమకథలో బలం లేకపోవడం. కొత్తదనం కనిపించకపోవడం. బట్ ఆ మైనస్ ను నాని, మృణాల్ లు నటనతో అధిగమించారు. అందువల్ల చూస్తున్నంత సేపూ ఫీల్ గుడ్ గానే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త తెలివిగా ఆలోచిస్తే సులువుగానే ఊహించొచ్చు. ఆ తర్వాత యష్ణ వీరి జీవితంలోకి వస్తే.. వీరు ఆమెను ఒప్పుకున్నారా లేదా.. మహి బ్రతుకుతుందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటన పరంగా నాని మరోసారి తనదైన శైలిలో మెప్పించాడు. అన్ని ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హోటెల్ సీన్ లో ఆ సీన్ కు తగ్గ బాధ్యత, పరిణతి రెండిటినీ బాగా పలికించాడు. సెకండ్ హాఫ్ మొత్తం నాని పాత్ర పూర్తి ఎమోషనల్ గానే సాగుతుంది. ఇక మృణాల్ నటిగా ఎప్పుడో నిరూపించుకుంది. ఇది తనకు మరో కొత్త పాత్ర. ఛాలెంజింగ్ రోల్ కాదు కానీ.. బాగానే చేసింది. కాకపోతే సినిమాలో వీరి జంట అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. మహిగా బేబీ కియారా ఖన్నా చాలాబాగా నటించింది. ప్రియదర్శి, జయరాం పాత్రలు రొటీన్.

టెక్నికల్ గా ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్.. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. హేషమ్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ కన్నుల విందుగా ఉందని చెప్పాలి. కూనూర్ ఎపిసోడ్ ను మరింత అద్బుతంగా క్యాప్చర్ చేశాడు వర్ఘీస్. ఎడిటింగ్ ప్రధాన లోపంగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది. ఇది దర్శకుడి టేక్ కాబట్టి ఎడిటర్ ను ఏం అనలేం. సెకండ్ హాఫ్ కొన్నిసార్లు సహనానికి పరీక్షలా ఉంటుంది. డైలాగ్స్ బావున్నాయి. కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటాయి. వైరా ఎంటర్టైన్మెంట్ వారికి ఇది ఫస్ట్ మూవీ. అయినా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బావున్నాయి.

ఇక దర్శకుడుగా శౌర్యు ఎంచుకున్న పాయింట్ అస్సలు కొత్తది కాదు. కమల్ హాసన్ వసంత కోకిల, రాజశేఖర్, సౌందర్యల మా ఆయన బంగారం సినిమాల పాయింట్స్ నే కాస్త అటూ ఇటూగా మార్చుకుని రాసుకున్నాడు. కథనం పరంగా అతనికి మైనస్ మార్కులే వేయాలి. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ కు భిన్నంగా ఇంత స్లో నెరేషన్ అంటే కాస్త ఇబ్బందే. సినిమాకు సంబంధించి పెద్ద కంప్లైంట్ కూడా అదే. బట్ అతని టేకింగ్, మేకింగ్ బావున్నాయి. ఈ తరహా కథలను మరింత బాగా చెప్పబోతున్నాడు అనిపించింది.

ప్లస్ పాయింట్స్ ః

నాని, మృణాల్ నటన(ఇండివిడ్యువల్ గా)

సంగీతం, పాటలు

సినిమాటోగ్రఫీ

ఎమోషనల్ సీన్

బేబీ కియార ఖన్నా

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ ః

లవ్ స్టోరీ

స్లో నెరేషన్

కథలో కొత్తదనం లేకపోవడం

నాని, మృణాల్ జంట

ఫైనల్ గా ః ఎమోషనల్ నాన్న.. ఎక్స్ పెక్టెడ్ స్క్రీన్ ప్లే

రేటింగ్ ః 2.75/5

- బాబురావు. కామళ్ల

Updated : 7 Dec 2023 10:28 AM IST
Tags:    
Next Story
Share it
Top