Home > సినిమా > అసలు కేసు నీపైనే పెట్టాలి.. మన్సూర్‌కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు

అసలు కేసు నీపైనే పెట్టాలి.. మన్సూర్‌కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు

అసలు కేసు నీపైనే పెట్టాలి.. మన్సూర్‌కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు
X

హీరోయిన్ త్రిషతో రేప్ సీన్ మిస్ అయిందంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఆ వ్యాఖ్యలను ఖండించినందుకు మరో ఇద్దరు ప్రముఖ నటులపై కూడా పరువు నష్టం వేసిన తమిళ నటుడు మన్సూర్​ అలీఖాన్‌కు కోర్టు చీవాట్లు పెట్టింది. చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడాల్సింది పోయి, తప్పుడు వ్యాఖ్యలను ఖండించిన వారిపై కూడా తిరిగి దావా వేస్తానంటూ కోర్టు మెట్లెక్కడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. అసలు బహిరంగంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు మొట్టికాయలు వేసింది.

లియో సినిమా ప్రమోషన్లలో భాగంగా మన్సూర్‌.. త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్రిషతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, ఆర్కే రోజా, నితిన్‌, లోకేష్‌ కనగరాజ్‌, మాళవికా మోహనన్‌, ఖుష్బూ, సింగర్‌ చిన్మయి తదితరులు అతని వ్యాఖ్యలను ఖండించారు. మొదట క్షమాపణలు చెప్పినట్లే చెప్పి.. ఆ తర్వాత త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా కేసు వేశాడు. తనను అనరాని మాటలు అన్నారంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మన్సూర్‌కి మొట్టికాయలు వేసేలా తీర్పు ఇచ్చింది.

"మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది... ప్రతిసారి వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత నేను అమాయకుడ్ని అనడం మీకు పరిపాటిగా మారింది..." అంటూ మన్సూర్ తిక్క కుదిర్చింది. సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకోవాలని న్యాయమూర్తి హితవు పలికారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల వీడియో (ఎడిట్ చేయని)ను సమర్పించాలని మన్సూర్ అలీ ఖాన్ తరపు న్యాయవాదికి స్పష్టం చేశారు. అన్ కట్ వీడియో సమర్పించేందుకు తాము సిద్ధమేనని మన్సూర్ అలీ ఖాన్ తరఫు న్యాయవాది అంగీకరించారు. అంతేకాదు, మన్సూర్ అలీ ఖాన్ పై త్రిష సోషల్ మీడియాలో చేసిన పోస్టును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో న్యాయమూర్తి స్పందిస్తూ... త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా ఈ కేసులో తమ వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబరు 22కి వాయిదా వేశారు.

Updated : 12 Dec 2023 7:42 AM IST
Tags:    
Next Story
Share it
Top