మణిపుర్‌లో 25 ఏళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్‌కు స్వేచ్ఛ.. విక్కీ కౌశల్ బొమ్మతో..
X
ఈసారి పంద్రాగస్ట్ మణిపుర్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత ఆ రాష్ట్రంలో తొలిసారి బాలీవుడ్ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. తీవ్రవాదుల హెచ్చరికతో ఇన్నాళ్లూ హిందీ సినిమాలకు దూరమైన రాష్ట్ర ప్రజలు, థియేటర్ల యజమానులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒకపక్క జాతుల ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓ విద్యార్థి సంఘం సాహసంతో బాలీవుడ్ సినిమాను ప్రదర్శించింది. రాష్ట్రంలో చివరిసారి ఆడిన హిందీ సినిమా బాలీవుడ్ బాద్షా ‘కుచ్ కుచ్ హోతాహై’. 1998 నుంచి 2023 ఆగస్ట్ 14 వరకు బాలీవుడ్‌పై నిషేధం కొనసాగింది.
మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చుర్‌చంద్రపుర్ జిల్లాలోని రంగ్‌కైలో తాత్కాలిక థియేటర్లో బాలీవుడ్ సినిమాను ప్రదర్శించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీసిన విక్కీ కౌశల్ మూవీ ‘ఉరీ ద సర్జికల్ స్ట్రయిక్’ని ప్రదర్శించారు. ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన చేశారు. మైతీయులకు, కుకీలకు మధ్య ఈ జిల్లాలోనే ఎక్కువ ఘర్షణలు జరిగాయి. హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే కుకీలల అనుకూల విద్యార్థి సంఘం ఉరీని ప్రదర్శించింది. మైతీయుల అతివాద సంస్థ ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ హిందీ సినిమాలను ప్రదర్శించకూడదని పాతికేళ్ల కిందట గట్టి హెచ్చరిక జారీ చేసింది. వేలకొద్దీ బాలీవుడ్ మూవీల వీడియోలను, ఆడియోలను ధ్వంసం చేశారు. అప్పట్నుంచి రాష్ట్రంలో హిందీ బొమ్మ పడలేదు. దేశానికి వ్యతిరేకమైన ఇలాంటి నిషేధాలపై తిరగబడాలనే ఉరీని ప్రదర్శించామని ‘స్థానిక తెగల సంఘం’ నేత గింజా వల్జాంగ్ చెప్పారు. తీవ్రవాదులు దశాబ్దాలపాటు గిరిజన తెగలను మాయ చేశారని, జనం ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారని అన్నారు.