Home > సినిమా > 2023 పాపులర్ నటుల జాబితాపై వివాదం.. ఇండియా అంటే బాలీవుడ్డేనా?

2023 పాపులర్ నటుల జాబితాపై వివాదం.. ఇండియా అంటే బాలీవుడ్డేనా?

2023 పాపులర్ నటుల జాబితాపై వివాదం.. ఇండియా అంటే బాలీవుడ్డేనా?
X

దక్షిణాది భారతీయులపై ఉత్తర భారత పార్టీలకు, నాయకులకు, ముంబై సినీవాలాలకు వివక్ష మామూలే. మహా అయితే తమిళ నటులకు కాస్త చిన్న తాంబూలం ఇస్తారు తప్ప తెలుగు, కన్నడ, మలయాళ సినీపరిశ్రమల మొహం కూడా చూడరు. బాలీవుడ్ సినిమాలను తలదన్నే కాంతారా, కేజీఎఫ్, బాహుబలి, జైలర్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు దక్షిణాదినే కాదు, ఉత్తారాదిని కూడా ఊపేస్తున్నా వివక్ష కొనసాగుతూనే ఉంది. చివరికి మూవీలకు, తారలకు రేటింగ్స్ ఇచ్చే సంస్థలు కూడా సౌతోళ్లను చిన్నచూపు చూస్తున్నారు. ప్రముఖ సినిమా డేటా బేస్ సంస్థ ఐఎండీబీ (IMDB) కూడా దీనికి మినహాయింపు కాదు. 2023 ఏడాదిగాను ఈ సంస్థ రూపొందించిన టెన్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో ఒక్క దక్షిణాది యాక్టర్ కూడా లేదు. మొత్తం పదిమందినీ బాలీవుడ్ నుంచే ఎంపిక చేశారు. వీరిలో నయనతార, విజయ్ సేతుపతి, శోభితా ధూళిపాళ ఉన్నప్పటికీ, వాళ్ల బాలీవుడ్ సినిమాల ఆధారంగానే జాబితాలోకి చేర్చారు. దీనిపై దక్షిణాది సినీజనం అగ్గిమీద గుగ్గులమవుతున్నారు. రజనీకాంత్, మోహన్ లాల్, విజయ్, రష్మిక మందన, సాయిపల్లవి, సమంత వంటి గొప్ప నటీనటుల సినిమాలు ఈ ఏడాది కూడా వచ్చిన సంగతిని ఐఎంబీడీ కావాలనే పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ఐఎంబీడీ ప్రకటిచిన 2023 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా ఆలియా భట్, దీపికా పదుకోన్, వామిక గబ్బీ, నయనతార, తమన్నా, కరీనా కపూర్, శోభిత ధూళిపాళ, అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి ఉన్నారు. తమ సైట్‌లో ఆయా తారలకు ప్రేక్షకులు ఇచ్చిన ర్యాంకులను బట్టి ఈ జాబితా రూపొందించామని ఐఎంబీడీ చెప్పుకొచ్చింది. ఈ జాబితాను బాలీవుడ్‌పై పక్షపాతంతో రూపొందించారని, దక్షిణ భారతంలో అసలు సినీ పరిశ్రమే లేదన్నట్లు జాబితా ఉందని విమర్శిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్, వైరసు, దసరా, విడుదలై, 2018 వంటి మంచి సినిమాలు ఈ ఏడాదే వచ్చాయని, వాటిలో నటించిన వాళ్లను ఎవరూ మెచ్చుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు.

Updated : 24 Nov 2023 8:08 PM IST
Tags:    
Next Story
Share it
Top