హను మాన్ నిర్మాతలకు వెంటనే న్యాయం చేయాలి - తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి
X
సంక్రాంతి సందర్భంగా విడుదలైన హను మాన్ సినిమాకు థియేటర్స్ కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని, వెంటనే వారిని న్యాయం చేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా.. మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఈ నెల 12 నుంచి తెలంగాణలో 'హను మాన్' సినిమా ప్రదర్శన కోసం కొన్ని థియేటర్స్ తో అగ్రిమెంట్ చేశారని, కానీ ఆ థియేటర్స్ వాళ్లు అగ్రిమెంట్ కు కట్టుబడి ఉండక నైజాం ఏరియా థియేటర్స్ లో ఈ సినిమాను ప్రదర్శించలేదని ఆరోపించారు. ఈ విషయం గురించి మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు హను మాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.థియేటర్ల అగ్రిమెంట్ ప్రకారం 'హను మాన్' సినిమా ప్రదర్శించకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అపార నష్టం జరిగిందని.. కాబట్టి వెంటనే ఈ థియేటర్స్ వారు.. హను మాన్ సినిమాను ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకూ జరిగిన నష్టాన్ని కూడా భరించాలని డిమాండ్ చేస్తోంది తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.
థియేటర్స్ వాళ్లు చేసిన ఇలాంటి చర్యల వల్ల తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం జరుగుతుందని, సదరు థియేటర్స్ వారు చేసిన చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ.. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం, నైతికత, నిబద్దత, న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ "హనుమాన్" సినిమాకి సత్వర న్యాయం చేయాలనీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుతున్నట్టు ఈ ప్రకటనలో తెలిపారు.