ఏపీలో ఆదిపురుష్ టికెట్ ధరల పెంపు..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్
X
ఆదిపురుష్ సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై రూ.50 వరకు పెంచుకోవడానికి సర్కార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లతో పాటు మల్టీప్లెక్సుల్లోనూ ఈ పెంపు వర్తించనుంది. మంగళవారం సినిమా నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీల ప్రతినిధులు తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఆదిపురుష్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అందుకు సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈమేరకు రేపు జీవో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు తెలంగాణలో బుధవారం ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని బుక్ మై షో సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచాలని నిర్మాతలు సర్కార్‌ను కోరినట్లు సమాచారం. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉత్తరాదిన ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. హిందీ వెర్షన్ ఆదిపురుష్ కు సంబంధించి ఇప్పటికే 55వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్‌కి మించి ఆదిపురుష్ కు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.