అమ్మకానికి జేమ్స్ కామెరూన్ ఎస్టేట్..ధర ఎంతంటే.. ?
X
ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటానిక్, అవతార్ వంటి విజువల్ వండర్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్ళిపోయాడు. అలాంటి మంచి కథలను ఆయన తనకు ఇష్టమైన ఎస్టేట్‌లో కూర్చొని సముద్రాన్ని చూసి రాస్తారు.ఇప్పుడు ఆ ఎస్టేట్‌ను జేమ్స్ కామెరూన్ దంపతులు అమ్మేస్తున్నారు. సుమారు 102 ఎకరాలు ఉండే ఎస్టేట్ విక్రయించాలని నిర్ణయించారు. ధాని ధరను కూడా ప్రకటించారు. 33 మిలియన్ డాలర్లు అంటే ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం.. రూ.272 కోట్లకు కామెరూన్ ఎస్టేట్‌ను విక్రయానికి పెట్టారు. ఇంతకీ అన్ని కోట్లు పలికే ఎస్టేట్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల హోలిస్టర్ రాంచ్ కమ్యూనిటీ ఆఫ్ గావియోటాలో 102 ఎకరాల్లో కామెరూన్ ఎస్టేట్ ఉంది. సముద్ర తీరానికి సమీపంలో గల ఈ ఎస్టేట్‌లో ఐదు బెడ్‌రూమ్‌లు మరియు ఆరు బాత్‌రూమ్‌లతో కూడిన 8,000 చదరపు అడుగుల ప్రధాన ఇల్లు ఉంది. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గెస్ట్ హౌస్ కలదు. అంతేకాకుండా 24,000 చదరపు అడుగుల ఒక పెద్ద గ్యారేజ్ ఉంది. దానిలో ఆయన కార్లు, హెలికాప్టర్, ఇతర వాహనాలను ఆ గ్యారేజ్‌లో ఉంచుతారు. అలాగే మంచి గ్రీనరీ కలిగిన లాన్‌లు, తాటి చెట్లు, ఒక పెద్ద కొలను ఆ ఎస్టేట్ లో ఉంది. ఎస్టేట్‌లో జిమ్, సినిమా థియేటర్, డ్యూయల్ ఆఫీసులు మరియు గేమ్ రూమ్ కూడా ఉన్నాయి. ఇది "హవాయి రిసార్ట్ రకమైన అనుభూతిని కలిగిస్తుందని కామెరూన్ వెల్లడించారు.
1990లో ఈ ఎస్టేట్‌ను హాలీవుడ్‌కు చెందిన ఓ జంట కొనుగోలు చేశారు. అప్పట్లో దీని ధర 4.3 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.35.53 కోట్లు.వారు న్యూజిలాండ్‌లో ఎక్కువగా గడుపుతున్నందున ఎస్టేట్‌ను కమ్యునిటీకి ఇచ్చేశారు. ఆ తర్వాత కామెరూన్ దాన్ని కొనుగోలు చేసి, తనకు నచ్చిన విధంగా మార్చుకున్నారు. సముద్ర జీవులను చూసేందుకు ఇష్టపడే కామెరూన్, బూడిద తిమింగలాలు, అప్పుడప్పుడు హంప్‌బ్యాక్, సీ ఓటర్‌లు, సీల్స్, డాల్ఫిన్‌లు, సముద్ర సింహాలను గుర్తించడానికి ఎస్టేట్‌లోని కిటికీ దగ్గర ఆర్మీ బైనాక్యులర్‌లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఒకే చోట స్థిరంగా ఉండటం కంటే.. అప్పుడప్పుడు మారుతూ కొత్తదనాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే కామెరూన్ ఈ ఎస్టేట్‌ను విక్రయించాలని చూస్తున్నారు.